Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం, మహిళా ప్రయాణికులకు ఎన్నో ప్రయోజనాలు
రైళ్లలో ప్రయాణించే సమయంలో సీట్ల గురించి ఆందోళన చెందవద్దు అని.. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్తులు సిద్ధం చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Special berths for Female Passengers: మహిళా ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణించే సమయంలో సీట్ల గురించి ఆందోళన చెందవద్దు అని.. మహిళా ప్రయాణికుల కోసం పలు రైళ్లలో ప్రత్యేక బెర్తులు సిద్ధం చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మహిళల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకూ రెగ్యూలర్ గా ప్రయాణించే బస్సులు, మెట్రో రైలు సర్వీసులలో ఎలాగైతే మహిళలకు ప్రత్యేక సీట్లు రిజర్వ్ చేశారో, అదే విధంగా భారతీయ రైల్వే మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. సుదూరం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లలో ఆరు బెర్తుల సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.
మహిళ భద్రత కోసం రైల్వే శాఖ ప్రణాళికలు
తక్కువ దూరం ప్రయాణించే వారు సైతం సీట్లు కావాలని, కూర్చుని ప్రయాణించాలని భావిస్తారు. అందులోనూ మహిళలకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణం కాస్త కష్టతరంగా ఉంది. ఈ క్రమంలో రైల్వే శాఖ మహిళా ప్రయాణికులకు శుభవార్త అందించింది. సుదూరం వెళ్లే రైళ్లలో మహిళా ప్రయాణీకులకు ప్రత్యేక బెర్తులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని కంపార్ట్ మెంట్లలో ప్రత్యేకంగా 6 బెర్తులను మహిళలకు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైళ్లలో చాలా దూరం ప్రయాణించే మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం, భారతీయ రైల్వే రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో సహా పలు ఇతర సౌకర్యాలను ప్రారంభించిందని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు.
మహిళలకు బెర్తుల రిజర్వ్ ఎలాగంటే..
కేంద్ర తెలిపిన రైళ్లలో ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు నుంచి ఏడు వరకు లోయర్ బెర్త్‌లు, ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ కోచ్‌లో 4 నుంచి 5 లోయర్ బెర్త్‌లు, ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ కోచ్‌లో 3 నుంచి 4 లోయర్ బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌ల కోసం రిజర్వ్ చేస్తోంది కేంద్ర రైల్వే శాఖ. దాంతోపాటు 45 అంతకంటే ఎక్కువ వయుసు ఉన్న మహిళా ప్రయాణీకులకు, గర్భిణీలకు రైలులో ఆ క్లాస్‌కు సంబంధించిన ఆయా కోచ్‌ల సంఖ్య ఆధారంగా సీట్ రిజర్వేషన్ అవుతాయని చెప్పారు.
మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వేశాఖ ఏర్పాట్లు
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రైళ్లు, స్టేషన్లలో మహిళా ప్రయాణికులతో పాటు ఇతర ప్రయాణికుల భద్రత కోసం జీఆర్పీ సాయంతో రైల్వేశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), జీఆర్పీ తో పాటు జిల్లా పోలీసులు ప్రయాణికులకు మెరుగైన భద్రతను అందిస్తున్నారని, మహిళా ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించాలని భావించిన రైల్వే శాఖ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా 'మేరీ సహేలి'ని ప్రారంభించింది.