India US Trade Talks: భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు వాయిదా! అదనపు సుంకాలపై ఉత్కంఠ
ఆగస్టు 25 నుంచి 29 తేదీ వరకు జరగనున్న భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై తదుపరి రౌండ్ చర్చలు వాయిదా పడే అవకాశం ఉంది.

India-US Trade Talks Delayed: ఆగస్టు 25 నుంచి 29 తేదీ వరకు జరగనున్న భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై తదుపరి రౌండ్ చర్చలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ విషయం ఓ అధికారి జాతీయ మీడియా సంస్థ పీటీఐకి వెల్లడించారు. అమెరికా ప్రతినిధి బృందం తన భారత పర్యటనను వాయిదా వేసినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకునే లక్ష్యంతో ఐదు ముందస్తు రౌండ్ల తర్వాత ఈ ఆరో రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల భారతీయ వస్తువులపై అమెరికా అధిక సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
50 శాతం పెరిగిన సుంకాలు
అమెరికా పెంచిన సుంకాలు ఆగస్టు 7 నుండి అమల్లోకి వచ్చాయి. దీనికితోడు రష్యా నుంచి ముడిచమురు, సైనిక పరికరాలు కొనుగోలు చేసినందుకు భారత్‌పై గుర్రుమన్న అగ్రదేశం అదనంగా మరో 25 శాతం లెవీ విధించింది. ఈ సుంకం ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు సుంకాలతో భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి పెరిగాయి.
500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో..
2025 ఏప్రిల్, జూలై మధ్య అమెరికాకు భారత ఎగుమతులు 21.64 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు 12.33 శాతం పెరిగి 17.41 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ద్వారా వెల్లడవుతోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం USD 12.56 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని USD 500 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని భావిస్తున్నాయి.
అమెరికా డిమాండ్లకు తలొగ్గని భారత్
ఇదిలా ఉంటే.. వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ వంటి రాజకీయంగా సున్నితమైన రంగాల్లో తమకు సానుకూలంగా వ్యవహరించాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేసింది. కానీ భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. లెవీలు తగ్గిస్తే సన్నకారు రైతులు, పశువుల పెంపకందారుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని అగ్రరాజ్యానికి స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైన అమెరికా భారత్‌పై సుంకాల భారం మోపుతోంది.
స్వదేశీ’ ఉత్పత్తులపై తిరిగి దృష్టి పెట్టాలి
అమెరికా కొత్త సుంకాలను ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశీయ పరిశ్రమలు మరియు రైతులకు మద్దతిస్తామని నొక్కి చెప్పారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశంపై స్పందించారు. ‘స్వదేశీ’ ఉత్పత్తులపై తిరిగి దృష్టి పెట్టాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులు, మత్స్యకారులు, పశువుల పెంపకందారుల సంక్షేమంపై భారత్ రాజీపడదని పునరుద్ఘాటించారు.
ఎలాంటి రాజీని అంగీకరించబోం..
‘భారత్‌లోని రైతులు, మత్స్యకారులు, పశువుల పెంపకందారులకు సంబంధించి వారి ఉపాధికి గండికొట్టే హానికరమైన విధానానికి వ్యతిరేకంగా మోదీ గోడలా నిలబడుతున్నారు. మా రైతుల విషయంలో ఎలాంటి రాజీని అంగీకరించబోం’ అని వెల్లడించారు. అయితే భారత్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు జరిగే ద్వైపాక్షిక చర్చలు సానుకూలంగా కనిపిస్తున్నాయి.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. పలు అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైతే అవి భారత్‌పై అమెరికా వాణిజ్య ఆంక్షలను ప్రభావితం చేయవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.





















