India Suspends Postal Services: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. అమెరికాకు పోస్టల్ సర్వీసును నిలిపిసిన భారత్
US Tariffs on India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై భారత్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అమెరికాకు పోస్టల్ సర్వీస్ బంద్ చేస్తున్నామని తెలిపింది.

Trump Tariffs on India | న్యూఢిల్లీ: అమెరికాతో సుంకాల సమస్యల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25వ తేదీ నుండి అమెరికాకు పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు భారత పోస్టల్ శాఖ (India Post Office) ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక కారణం అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో చేసిన తాజా మార్పులేనని స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జూలై 30న కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 800 డాలర్ల లోపు విలువ కలిగిన వస్తువులు అమెరికాకు కస్టమ్స్ డ్యూటీ (Customs Duty) లేకుండా పంపేవారు. అయితే, ఆ మినహాయింపును ఇప్పుడు రద్దు చేశారు. దీంతో ఆగస్టు 29 నుండి అమెరికాకు వెళ్లే ప్రతి వస్తువుపై కస్టమ్స్ డ్యూటీ తప్పనిసరి కానుంది. డాక్యుమెంట్లు, 100 డాలర్ల లోపు విలువగల గిఫ్ట్‌లకు మాత్రం మినహాయింపు కొనసాగిస్తారు.
ఈ కొత్త నిబంధనలు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమీ పవర్స్ యాక్ట్ (IEEPA) కింద అమలు అవుతాయి. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఇప్పటికే ఆగస్టు 15న ట్రాన్స్‌పోర్ట్ క్యారియర్లు, క్వాలిఫైడ్ పార్టీలకు ఈ మార్పులపై ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా, ఇకపై అంతర్జాతీయ పోస్టల్ షిప్‌మెంట్‌లపై సుంకం చెల్లించక తప్పదు.
అమెరికాకు వీలైనంత త్వరగా పూర్తి స్థాయి సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పోస్టల్ విభాగం తెలిపింది. PIB ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తామని, సిబిపి-యుఎస్‌పిఎస్ నుంచి సూచనలు అందిన వెంటనే నిలిపివేసిన కార్యకలాపాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని పోస్టల్ విభాగం స్పష్టం చేసింది.






















