India Office Romance: మీ ఆఫీసులో లవ్ అఫైర్స్ నడుస్తున్నాయా, ఇందులో మెక్సికో నెంబర్ 1.. భారత్ స్థానం ఎంతంటే
office romance In India | పనిచేసేచోట, ఆఫీసులలో ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణంగా మారాయి.. అంతర్జాతీయ సర్వే ప్రకారం భారత్ ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం మన జీవితంలో ఎక్కువ భాగం ఆఫీసులోనే గడిచిపోతుంది. ఎక్కువ గంటలు, టీమ్ వర్క్, నిరంతరం సంభాషణలు, కలిసి పనిచేయడం వల్ల కొన్నిసార్లు వారి రిలేషన్‌లో దూరం తగ్గుతుంది. ఇలాంటి వాతావరణం చాలాసార్లు ప్రజలను ఒకరికొకరు దగ్గర చేస్తుంది. అందుకే ఆఫీసులో ప్రేమ ఆశ్చర్యం కలిగించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చాలా చర్చ జరుగుతోంది. తాజా అంతర్జాతీయ సర్వే ప్రకారం, ఆఫీస్ రొమాన్స్ విషయంలో భారతదేశం ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా ఉంది.
ఇటీవల ప్రైవేట్, పర్సనల్ రిలేషన్లకు ప్రసిద్ధి చెందిన ప్లాట్‌ఫారమ్ అయిన Ashley Madison, YouGovతో కలిసి 11 దేశాలలో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు ఆఫీసు రొమాన్స్ పట్ల భారతీయుల ఆలోచనలు, వారి ధోరణుల గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాయి.
ప్రపంచంలో రెండవ స్థానంలో భారతదేశం
సర్వే ప్రకారం ఆఫీసులో ఏర్పడే రొమాంటిక్ రిలేషన్ విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఈ జాబితాలో మెక్సికో మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం ఆ తరువాత స్థానంలో నిలిచింది. ఈ సర్వేలో మొత్తం 11 దేశాలు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, భారతదేశం, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇటలీ, బ్రిటన్, అమెరికాలో నిర్వహించారు. ఇందులో మొత్తం 13,581 మంది ఉద్యోగులను అడిగి వివరాలు సేకరించారు. .
పది మందిలో నలుగురు ఆఫీసులో అఫైర్
భారతదేశంలో పనిచేసేచోట సంబంధాలు పెట్టుకోవడం, రిలేషన్ చాలా సాధారణమని చెబుతున్నారు. సర్వే ప్రకారం, 10 మంది భారతీయులలో నలుగురు ఇప్పటికే ఒక సహోద్యోగిని డేట్ చేశారు లేదా ప్రస్తుతం అలాంటి రిలేషన్‌లో ఉన్నారు. మెక్సికోలో 43 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు సహోద్యోగిని డేట్ చేశామని తెలిపారు. భారతదేశంలో 40 శాతం మంది, అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కేవలం 30 శాతం మంది మాత్రమే కొలిగ్ తో రిలేషన్ లో ఉన్నారు. భారతదేశంలో ఆఫీసు రొమాన్స్ గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అనవరసర రిలేషన్‌షిప్, సంబంధాలపై ఆసక్తి ఉన్న వారి జాబితాలో కాంచీపురం అగ్రస్థానంలో ఉంది.
పురుషులా లేదా మహిళలా, ఎవరు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు?
అధ్యయనం ప్రకారం, 51 శాతం మంది పురుషులు సహోద్యోగితో ఏకాంతంగా గడపటానికి అంగీకరిస్తున్నారు. అయితే 36 శాతం మంది మహిళలు అదే విషయాన్ని తెలిపారు. అంటే పురుషులు ఈ రకమైన సంబంధాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఓవైపు అఫైర్, మరోవైపు కెరీర్ మధ్య సమతుల్యత గురించి మహిళల ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో 29 శాతం మంది మహిళలు ఆఫీసులో అఫైర్స్ పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదని, ఇది వారి కెరీర్‌పై, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో27 శాతం మంది పురుషులు అలాగే భావిస్తున్నారు. దీంతో పాటు 18 నుండి 24 సంవత్సరాల వయసులో ఉన్న ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ వయస్సు గల 34 శాతం మంది యువకులు కెరీర్‌పై ప్రభావం చూపుతుందని ఆఫీసులో రిలేషన్స్‌కు దూరంగా ఉంటామని చెప్పారు.
భారతదేశంలో ఓపెన్ రిలేషన్స్‌పై మొగ్గు
భారతదేశంలో ఆఫీసు రొమాన్స్ పెరగడం చాలా మార్పులను సూచిస్తుంది. సాంప్రదాయేతర సంబంధాలు, ఓపెన్ రిలేషన్షిప్స్, ఓపెన్ మ్యారేజ్ వంటివి ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. డేటింగ్ యాప్ Gleeden నిర్వహించిన సర్వేలో 35 శాతం మంది భారతీయులు ప్రస్తుతం ఓపెన్ రిలేషన్షిప్‌లో ఉన్నారు. 41 శాతం మంది తమ భాగస్వామి సూచిస్తే, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దేశంలో ఈ ధోరణి పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. చిన్న పట్టణాలకు వ్యాపించింది.






















