Monkeypox Cases: ఢిల్లీ మంకీపాక్స్ కేసులు లైంగిక చర్య వల్ల సంక్రమించాయా? ICMR కీలక స్టడీ
ఢిల్లీలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. నగరంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది.
ఢిల్లీలో గుర్తించిన ఐదు ధృవీకరించిన మంకీపాక్స్ క్లినికల్ కేసులలో ఒక్కటి కూడా సెకండరీ కాంప్లికేషన్స్ లేదా లైంగిక చర్య వల్ల వైరస్ సంక్రమణ కాలేదని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఐదు కేసుల్లోని ఒక కేసులో మాత్రం హెపటైటిస్ - బి వైరస్ లైంగికంగా కలవడం వల్ల సంక్రమించిందని గుర్తించారు. కానీ, మంకీపాక్స్ వైరస్ మాత్రం లైంగికంగా సంక్రమణ కాలేదని తేల్చారు. ఢిల్లీ మంకీపాక్స్ కేసులను పరిశీలిస్తున్న మేనేజ్ మెంట్ రీసెర్చర్స్, ఐసీఎంఆర్ రీసెర్చర్స్.. లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది.
‘‘మంకీపాక్స్ కేసులు, ఇన్ఫెక్షన్ మన కమ్యూనిటీలో తక్కువగా ఉన్నట్లు చాటుతున్నాయి. పురుషులు స్వలింగ సంపర్కం చేయడం (MSM), మహిళా సెక్స్ వర్కర్ల (FSW)తో లైంగిక సంబంధం కలిగి ఉన్న సందర్భాల్లో అధికంగా MPXV active surveillance అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది.’’ అని అధ్యయనం తేల్చింది. అయితే, ఈ అధ్యయనంపై ఇంకా పీర్-రివ్యూ (నిపుణులు పరిశోధనలో కనుగొన్న విషయాలను అదే రంగంలోని ఇతర నిపుణులు పరిశీలించడం) జరగలేదు.
ఢిల్లీలో కనుగొన్న ఐదు మంకీపాక్స్ రోగుల్లో ముగ్గురు ఇతరులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లుగా అంగీకరించారు. ఈ ఐదుగురు రోగులలో ముగ్గురు ప్రారంభ లక్షణాల నుండి 21 రోజులలోపు భిన్న లింగ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు అంగీకరించినట్లు స్టడీలో తెలిపారు. ఇది కాకుండా, మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఎలాంటి లైంగిక సంబంధాలు జరపలేదని చెప్పారు.
ఈ వ్యాధి సోకిన వారందరికీ తేలికపాటి జ్వరం, కండరాల నొప్పి, జననేంద్రియాలు, గజ్జలు, దిగువ అవయవాలు, ఇతర అవయవాలపై పుండ్లు ఉన్నాయని అధ్యయనం తెలిపింది. వారందరూ వ్యాధి నుంచి మంచిగా కోలుకోవడం కూడా కనిపించింది. వాస్తవానికి, ICMR-NIV పూణే, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, AIIMS నిపుణులు ఢిల్లీలో కనుగొన్న మంకీపాక్స్ యొక్క ఐదుగురు రోగులపై పరిశోధన చేశారు. ఈ ఐదుగురు విదేశీ ప్రయాణాలు చేయలేదని వెల్లడించారు.
ఢిల్లీలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. నగరంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. మంకీపాక్స్ అనేది వైరల్ జూనోటిక్ వ్యాధి. ఇది సోకితే జ్వరం, చర్మంపై బొబ్బలు, లెంఫాడెనోపతి, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, చలి లేదా చెమటలు, గొంతు నొప్పి, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అన్ని కేసుల్లోనూ రోగులు త్వరగానే రికవరీ అవుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం, మొత్తం ఐదు కేసుల్లోనూ తేలికపాటి నుండి ఓ మోస్తరుగా అప్పుడప్పుడు వస్తున్న జ్వరం, మైయాల్జియా, జననేంద్రియాలు, గజ్జల్లో కురుపులు వంటివి ఉన్నట్లు గుర్తించారు.