Earthquake Alert: భూకంపం వస్తుందని టెన్షన్ ఎందుకు, ఆండ్రాయిడ్ ఫోన్లో అలర్ట్స్ యాక్టివేట్ చేసుకోండి
భూకంపాలు అకస్మాత్తుగా సంభవిస్తాయి. దాని ప్రభావం అధికంగా ఉంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని వారు భూంకంపం అలర్ట్స్ ఆన్ చేసుకోవాలి.

Earthquake alerts on Android Phone: భూకంపాలు అనేవి సహజ విపత్తులు. భూమి లోపలి పొరల్లో శిలల రాపిడి, స్థానభ్రంశం ఇతరత్రా కారణాలతో కొన్నేళ్లుగా భూమి కంపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి ప్రాంతాలలో, ఒకటే నెలలో మూడు, నాలుగు భూకంపాలు రావడం చూశాం. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలు భూకంప ప్రభావిత ప్రాంతాల జోన్ల కిందకి వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలు యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. భూకంపాలను మనం ఆపలేనప్పటికీ, సాంకేతికత ద్వారా ముందుగానే తెలుసుకుని అప్రమత్తం కావచ్చు. ఈ ఉద్దేశంతో గూగుల్ Android Earthquake Alerts Systemని రూపొందించింది, ఇది Android స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. భూకంపం రాకముందే కొంచెం సమయం ముందైనా వినియోగదారులను హెచ్చరిస్తుంది.
ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
గూగుల్‌లోని ఈ సిస్టమ్ మీ ఫోన్‌ను చిన్న భూకంప డిటెక్టర్ (mini-seismometer)గా మారుస్తుంది. అసాధారణ కదలికలు ఉన్నప్పుడు, అది తన స్థానంతో సహా డేటాను గూగుల్ సర్వర్‌కు పంపిస్తుంది. సమీపంలోని చాలా ఫోన్లు ఇలాంటి కదలికలను గుర్తిస్తే, భూకంపం వచ్చిందని టెక్ దిగ్గజం గూగుల్ నిర్ధారిస్తుంది. వెంటనే ఆ ప్రాంతంలోని భూకంపం అలర్ట్ యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులకు హెచ్చరికను పంపుతుంది.
కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ వంటి కొన్ని అమెరికా ప్రాంతాలలో గూగుల్ ShakeAlert తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది 1600 కంటే ఎక్కువ సెసిమిక్ సెన్సార్ల ద్వారా తమ వినియోగదారులకు కొంచెం ముందుగానే, లేక భూకంపం వస్తున్న సమయంలోనే భూకంప సమాచారాన్ని అందిస్తుంది.
గూగుల్ ఎలాంటి హెచ్చరికలను పంపుతుంది?
Be Aware Alert – ఇది తేలికపాటి భూ ప్రకంపనల (భూకంపం) సమయంలో (4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత) అలర్ట్ చేస్తుంది
Take Action Alert – ఇది తీవ్రమైన ప్రకంపనల సమయంలో పనిచేస్తుంది. ఈ హెచ్చరిక మీ ఫోన్ Do Not Disturb సెట్టింగ్‌ను కూడా డిస్టర్బ్ చేస్తుంది. గట్టి శబ్దంతో ఆండ్రాయిడ్ యూజర్లను వెంటనే హెచ్చరిస్తుంది. దాంతో మీరు మిగతావారి కంటే ముందుగానే అప్రమత్తమై సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవచ్చు.
Android Phoneలో భూకంపం అలర్ట్స్ ఎలా ఆన్ చేయాలి?
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ అలర్ట్స్ కావాలంటే..
- మీ ఫోన్ Android 5.0 లేదా దాని తరువాత లేటెస్ట్ వెర్షన్ అయి ఉండాలి.
- ఇంటర్నెట్, లొకేషన్ సర్వీస్‌లను మొబైల్‌లో ఆన్ చేయండి.
- ఇప్పుడు సెట్టింగ్‌లకు వెళ్లాలి. Safety & Emergency సెక్షన్‌కు వెళ్లాలి. (కనిపించకపోతే, "Location" > "Advanced" ప్రెస్ చేయండి)
- ఇప్పుడు Earthquake Alerts ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇది ఆఫ్ అయి ఉండే కనుక దాన్ని ఆన్ చేయండి.
ఒకసారి ఆన్ చేసిన తర్వాత, మీరు ఫోన్‌ను ఉపయోగించకపోయినా, భూకంపాల సమయంలో మీకు అలర్ట్స్ పంపుతుంది. కొన్ని సెకన్ల ముందు వచ్చే చిన్న హెచ్చరిక కూడా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. భారీ భూంకంపాల సమయంలో ఇంటి నుంచి బయటకు పరుగెత్తి మీ ప్రాణాలు నిలుపుకోవచ్చు.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీగా రూపాంతరం చెందింది. రష్యా, జపాన్, అమెరికాలతో పాటు మొత్తం 30 దేశాల్లో ప్రభావం చూపుతోంది.






















