Allahabad High Court: హిందూ వివాహాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Allahabad High Court: సప్తపది వేడుక, ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Allahabad High Court: సప్తపది వేడుక, ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన నుంచి విడిపోయిన భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే రెండవ వివాహం చేసుకుందని ఆరోపించిన ఒక వ్యక్తి పిటిషన్‌ను తిరష్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తాను రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో వేసిన పిటీషన్‌ను భార్య అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్.. ‘వివాహానికి సంబంధించి సరైన వేడుకలు, సరైన ఆచారాలతో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం. సంప్రదాయాలు, ఆచారాలను పాటించి వివాహం జరుపుకోకపోతే లేదా నిర్వహించకపోతే అది పెళ్లి అని చెప్పలేం’ అని వ్యాఖ్యానించారు. వివాహానికి సంబంధించి ఖచ్చితంగా చేయాల్సిన క్రతువుల్లో సప్తపది ఒకటని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, సాంప్రదాయాలు లేకుండా వివాహం జరిగితే అది శాష్త్రీయంగా జరిగిందని భావించలేమని చట్టం దృష్టిలో అది వివాహం కాదన్నారు.
వివాహం చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే, పార్టీలకు వర్తించే చట్టం ప్రకారం, చట్టం దృష్టిలో అది వివాహం కాదని అభిప్రాయపడింది. హిందూ చట్టం ప్రకారం పెళ్లిలో 'సప్తపది' కృతువు పెళ్లి చెల్లుబాటు అయ్యే వాటిలో ఒకటి అని పేర్కొంది. అయితే ప్రస్తుత కేసులో పేర్కొన్న సాక్ష్యాలు లేవని కోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ మేరకు.. ఇది హిందూ వివాహాన్ని వారి సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా జరుపుకోవచ్చని పేర్కొంది. ఈ ఆచారాలు, వేడుకల్లో'సప్తపది' (వరుడు, వధువు పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేయడం) వివాహాన్ని పూర్తి చేస్తుందని, బంధాన్ని ఏర్పరుస్తుందని పేర్కొంది.
అనంతరం మీర్జాపూర్ ఫ్యామిలీ కోర్టు గతేడాది ఏప్రిల్ 21న జారీచేసిన సమన్లను రద్దుచేశారు. భార్యపై చేసిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాల్లేవని, ఎటువంటి నేరం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. కేసు వివరాలు... స్మృతి సింగ్ అనే మహిళ వివాహం 2017లో సత్యం సింగ్‌తో ఘనంగా జరిగింది. అయితే కొద్ది కాలానికి స్మృతి సింగ్ ఆమె అత్తమామల ఇంటిని విడిచిపెట్టి వెళ్లింది. కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు భర్త సత్యం సింగ్, అత్తమామలపై చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసుల దర్యాప్తులో వారు వేధింపులకు పాల్పడం వాస్తవమని తేలింది.
ఆ తర్వాత సత్యం తన భార్యపై రెండో పెళ్లి ఆరోపణలు చేశారు. తన భార్య స్మృతి సింగ్ రెండో వివాహం చేసుకుందని, సెప్టెంబర్ 20, 2021న ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సత్యం సింగ్ ఏప్రిల్ 21, 2022న మీర్జాపూర్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి స్మృతి సింగ్‌కు సమన్లు పంపారు. దీనిపై సర్కిల్ అధికారి సదర్, మీర్జాపూర్ క్షుణ్ణంగా విచారించగా, స్మృతిపై ఆరోపణలు అవాస్తవమని తేలింది. దీనిని ఆమె సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానంపై హిందూ వివాహాల్లో సప్తపది కీలకమని వ్యాఖ్యలు చేసింది.