(Source: ECI/ABP News/ABP Majha)
Himachal Pradesh News: కోటికిపైగా అమ్ముడుపోయిన ఫ్యాన్సీ నెంబర్ కేసులో కొత్త - నిజమా, మోసమా తెలియని కన్ఫ్యూజన్‌లో అధికారులు?
Himachal Pradesh News: హిమాచల్ ప్రదేశ్ లో ఓ వ్యక్తి లక్ష రూపాయలు పెట్టి కొన్ని స్కూటీ కోసం ఏకంగా కోటి రూపాయలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ కోసం బిడ్ దాఖలు చేశాడు. అయితే ఆ వ్యక్తి యొక్క వింత చర్య ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇది నిజమా లేక మోసమా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Himachal Pradesh News: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆసక్తికరమైన కేసు వెలుగు చూసింది. ఇక్కడ కొట్‌ఖాయ్ లైసెన్స్ అథారిటీలో ఓ వ్యక్తి స్కూటీ వీఐపీ నంబర్‌కు రూ.1 కోటి 12 లక్షల 15 వేల 500 వేలం వేశారు. ఈ విషయం గురువారం నాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్ బిడ్డింగ్ ముగిసిన తర్వాత ఈ వీఐపీ నంబర్ కోటి రూపాయలకు పైగా అమ్ముడైంది. వీఐపీ నంబర్ కోసం కోట్లకు వేలం వేసిన వ్యక్తి పేరు దేశరాజ్. అయితే ఇతను ఎక్కడ నివసిస్తున్నాడనే సమాచారం లేదు. ఇలాంటి పరిస్థితిలో, ఇది ఆన్‌లైన్ మోసం కూడా అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్కూటీ కోసం ఎవరైనా కోట్లాది రూపాయలను వేలం వేస్తే ఎలా అని అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఇప్పుడు దేశరాజ్ మూడు రోజుల్లో 30 శాతం డబ్బులను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పేరు మాత్రమే వెల్లడి..
హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ అదనపు డైరెక్టర్ హెమిస్ నేగి మాట్లాడుతూ.. దరఖాస్తుదారు దేశ్‌రాజ్ స్కూటీ యొక్క వీఐపీ నంబర్ కోసం రూ. 1.12 కోట్లకు పైగా వేలం వేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్ బిడ్‌లో వ్యక్తి పేరు మాత్రమే కనిపించిందని అన్నారు. ఆ వ్యక్తి ఆచూకీని ఇంకా ఆ శాఖ గుర్తించలేకపోయిందని వివరించారు. ఇలాంటి పరిస్థితిలో గందరగోళం ఉండవచ్చని... ఇది ఎవరో కావాలని చేసి ఉంటారని భావిస్తున్నారు.
HP-99-9999 నెంబర్ కోసం బిడ్ వేసిన 26 మంది..
ఫ్యాన్సీ నెంబర్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లో కోట్లాది రూపాయల బిడ్‌లు రావడం ఇదే తొలిసారి. అయితే సిమ్లాలో వీఐపీ నంబర్ క్రేజ్ నిజంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేయిస్తుందా లేదా అనేది ఇప్పటి వరకూ తెలియట్లేదు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. జనాలు కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. HP-99-9999 నంబర్‌కు చెందిన 26 మంది వ్యక్తులు బిడ్ వేయగా.. ఇందులో అత్యధికంగా ఒక కోటి 12 లక్షల 15 వేల 500 రూపాయల ధర పలికింది. ఇంత ఎక్కువ ధర రావడంతో ఆ శాఖ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరైనా మోసపూరితంగా చేస్తే.. సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందం దీన్ని విచారిస్తుందని వివరిస్తున్నారు.