మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం - ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం
Election Campaign Ends: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది.
Madhya Pradesh Election Campaign Ends:
ముగిసిన ప్రచారం..
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల (Madhya Pradesh Election)ప్రచారం ముగిసింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో ఓ విడత పోలింగ్ పూర్తైంది. నవంబర్ 7వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh Election) 20 సీట్లలో తొలి విడత ఎన్నికలు జరగ్గా..నవంబర్ 17న మరో విడత పోలింగ్‌కి అంతా సిద్ధమైంది. అటు మధ్యప్రదేశ్‌లోనూ 230 నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా ప్రచారం ముగిసిపోయింది. ఇన్నాళ్లూ పార్టీల ప్రచారంతో మారు మోగిన ప్రాంతాలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. ప్రచారం చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీ కీలక ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీని మరోసారి ఎన్నుకోవాలని కోరారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలంతా అభివృద్ధికే ఓటు వేస్తారన్న నమ్మకముందని వెల్లడించారు. అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌కి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని హామీలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. అయితే...మధ్యప్రదేశ్‌లో అధికారం కోసం కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇక్కడ ప్రచార బాధ్యతల్ని తీసుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌ని పడగొట్టి తమకు అవకాశమివ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అటు బీజేపీ తరపున కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్టార్ క్యాంపెయినర్‌లుగా ఉన్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ కూడా గట్టిగానే ప్రచారం చేశారు. నిజానికి ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారంలో రావాలని బీజేపీ పట్టుదలతో ఉండగా...అటు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న పంతంతో ఉంది.
మోదీపై ఖర్గే విమర్శలు..
ఈ ప్రచారంలో భాగంగానే మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి లోకల్ లీడర్‌గా మారిపోయి అన్ని చోట్లా తిరగడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేశారు. ఇలా వీధుల్లో తిరిగే బదులు చేయాల్సిన పనులు చేస్తే ఇంకా బాగుంటుందంటూ చురకలు అంటించారు.
"ప్రధాని స్థాయి వ్యక్తి తన బాధ్యతల్ని పక్కన పెట్టి ఇలా ఎన్నికల ప్రచారం కోసం వీధుల్లో తిరుగుతుండడం విడ్డూరంగా ఉంది. ఆయన ప్రధాని అని గుర్తు పెట్టుకోవాలి. ఇలా వీధుల్లో తిరిగే బదులు చేయాల్సిన పనులు చేస్తే మంచిది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వల్లే ఇవాళ మోదీ ప్రధాని అవ్వగలిగారు."
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ప్రియాంక ఫైర్...
అటు ప్రియాంక గాంధీ కూడా బీజేపీ నేతలపై విమర్శలు సంధించారు. కేంద్ర మంత్రి, మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాపై మండి పడ్డారు. వెన్నుపోటు పొడవడంలో సింధియాకి మించిన వాళ్లెవరూ లేరని ఆరోపించారు. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కొంత వరకూ మొగ్గు ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే...అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు వస్తాయా లేదా అన్నది క్లారిటీ లేదు. కాంగ్రెస్ మాత్రం కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉంది.
Also Read: Karnataka Hijab Ban: ఎగ్జామ్ హాల్‌లోకి హిజాబ్‌తో రావచ్చు, కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన