Gujarat:ఒకేరోజు ఇద్దరు మాజీ సీఎంలకు తప్పిన ప్రమాదం, క్షేమంగా బయటపడ్డ రూపానీ, మోహతా
ఒకే రోజు ఇద్దరు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో క్షేమంగా బయటపడటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు
Vijay Rupani, Suresh Mehta escape unhurt: ఒకే రోజు ఇద్దరు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో క్షేమంగా బయటపడటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రూపానీ కాన్వాయ్ లోని వాహనం బైకర్ ను ఢీ కొంటే, సురేష్ మెహతా వాహనాన్ని ట్రక్కు ఢీ కొంది.
అహ్మదాబాద్- రాజ్‌కోట్ జాతీయ రహదారిపై విజయ్ రూపానీ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా సురేంద్రనగర్ జిల్లా వద్ద ప్రమాదం జరిగింది. ప్రభు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటేందుకు ప్రయాణిస్తున్నారు. ఆయన వాహనాన్ని విజయ్ రూపానీ కాన్వాయ్‌లోని ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో రూపానీ వేరే కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం తర్వాత గాయపడిన వ్యక్తిని ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన మాజీ సీఎం, ప్రత్యేక వాహనంలో బాధితుడ్ని హాస్పిటల్‌కి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని, చిన్న చిన్న గాయాలతో ఆ వ్యక్తి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
మరోవైపు మాజీ సీఎం మెహతా సైతం మరో ప్రమాదంలో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. మోర్బీ జిల్లా హల్వద్ పట్టణం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. కారు మలుపు తీసుకుంటున్న సమయంలో వెనుక వస్తున్న వాహనం మోహతా కారును ఢీకొంది. కారును చూసి ట్రక్కు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేశారు. భారీ వాహనం కావడంతో కంట్రోల్ తప్పింది. స్వల్ప వేగంతో మెహతా ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం తర్వాత వేరే వాహనంలో మెహతా వెళ్లిపోయారు. గుజరాత్ కు 1995 నుంచి 1996 మధ్య మెహతా సీఎంగా వ్యవహరించారు.