New Scheme: జగన్ బాటలో స్టాలిన్, అమ్మాయిలను చదివిస్తే నెలకు వెయ్యిరూపాయలు
ఉన్నత చదువులకు వెళ్లే బాలికల సంఖ్య పెంచేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది.
బాలికలు ఉన్నత విద్య పూర్తి చేసేలా ప్రోత్సహించేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల వాళ్ల ఖాతాల్లో వెయ్యిరూపాయలు వెయ్యాలని నిర్ణయించింది.
ఈ పథకం వల్ల సుమారు ఆరు లక్షల మంది బాలికలు లబ్ధిపొందనున్నారు. నిన్న బడ్జెట్ ప్రవేశ పెట్టిన పళనివెల్ థైగా రాజన్ ఈ వివరాలు వెల్లడించారు. సుమారు 698 కోట్ల రూపాయలతో ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలు ఈ పథకానికి అర్హులు. డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసే వరకు ఈ డబ్బులు వారి ఖాతాలో పడుతుంటాయన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు వస్తున్న స్కాలర్‌షిప్‌నకు ఇది అదనమని తెలిపారు.
ఉన్నత విద్యలో ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల నమోదు నిష్పత్తి తక్కువగా ఉందని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బాలికల కోసం అమలు చేస్తున్న పథకాలు కంటిన్యూ అవుతాయని పేర్కొంది. మూవలూరు రామామృతం అమ్మయ్యర్ స్మారక వివాహ సహాయ పథకాన్ని మూవలూరు రామామృతం అమ్మయ్యర్ ఉన్నత విద్యా భరోసా పథకంగా మారుస్తున్నట్లు తెలిపింది.
ఈవీఆర్ మణిఅమ్మయ్యర్ స్మారక వితంతు కుమార్తె వివాహ సహాయ పథకం, డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి స్మారక కులాంతర వివాహ సహాయ పథకం, అన్నై థెరెసా అనాథ బాలికల వివాహ సహాయ పథకం, డాక్టర్ ధర్మాంబళ్ అమ్మయార్ స్మారక వితంతువుల పునర్వివాహ పథకం అమలులో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతుందని తెలిపారు మంత్రి.