G20 కారణంగా ఢిల్లీలో మూడు రోజుల లాక్‌డౌన్! పుకార్లే అని తేల్చి చెప్పిన పోలీసులు
G20 Summit 2023: సెప్టెంబర్ 8-10వ తేదీ వరకూ ఢిల్లీలో లాక్‌డౌన్ ఉంటుందన్న వార్తలు నిజం కాదని పోలీసులు వెల్లడించారు.
G20 Summit 2023:
ఢిల్లీలో G20 సమ్మిట్..
సెప్టెంబర్ 9,10వ తేదీల్లో ఢిల్లీ వేదికగా G-20 సదస్సు (G20 Summit) జరగనుంది. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సదస్సులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. వేలాది మంది పారామిలిటరీ సిబ్బంది ఢిల్లీకి చేరుకున్నారు. పోలీసులూ అన్ని చోట్లా పహారా కాస్తున్నారు. తనిఖీలు చేస్తున్నారు. ఈ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే...ఇవి పుకార్లేనని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ దేశాల అధినేతలు వస్తుండటం వల్ల ఆంక్షలు మాత్రమే విధించామని, లాక్‌డౌన్ పెట్టామన్న వార్తల్లో నిజం లేదని ఢిల్లీ పోలీస్ PRO సుమన్ నల్వా స్పష్టం చేశారు.
"G20 సదస్సు జరిగే ప్రాంత పరిసరాల్లోని అన్ని దుకాణాలు, ఇతరత్రా కమర్షియల్ కాంప్లెక్స్‌ని మూడు రోజుల పాటు మూసివేయనున్నాం. ఢిల్లీ మెట్రోలనే ప్రజలు ప్రయాణించాలని కోరుకుంటున్నాం. కొన్ని ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తాం. ఆ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ID కార్డ్‌లు చూపించాల్సిందే. నిత్యావసరాల పంపిణీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. లాక్‌డౌన్ ఉంటుందన్న వార్తల్లో నిజం లేదు. ఆ పుకార్లను దయచేసి నమ్మకండి"
- సుమన్ నల్వా, ఢిల్లీ పోలీస్ పీఆర్‌వో
#WATCH | Regarding the G20 summit, rumours are spreading that Delhi will be under lockdown at that time. It is factually not correct. As a number of heads of States are coming and international organisations are joining, that's why we have made a 'Controlled zone' in the New… pic.twitter.com/QlZLvN6kSS
— ANI (@ANI) August 31, 2023
దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న G 20 సమ్మిట్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దేశాల అధినేతలు, ప్రతినిధులు వస్తుండడం వల్ల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది. ఢిల్లీ పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) మాడ్యూల్స్‌తో నిఘా పెడుతున్నారు. AI ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా G 20 సమ్మిట్ వేదిక పరిసరాల్లో చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేస్తారు భద్రతా సిబ్బంది. అనుమానాస్పదంగా ఎవరు తిరిగినట్టు కనిపించినా వెంటనే గుర్తిస్తాయి ఈ కెమెరాలు. వీటితో పాటు సాఫ్ట్వేర్ అలార్మ్స్ కూడా ఏర్పాటు చేశారు. గోడలు ఎక్కడం, పరిగెత్తడం, వంగి నడవడం లాంటివి చేస్తే ఈ AI కెమెరాలు సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేస్తాయి. National Security Guard కమాండోలతో పాటు ఇండియన్ ఆర్మీ స్నైపర్స్ భారీ బిల్డింగ్‌లపై పహారా కాయనున్నారు. వీరితో పాటు ఇంటర్నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీలకు చెందిన సిబ్బంది కూడా ఢిల్లీకి రానుంది.