Bihar Election 2025: బిహార్ శాసన సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు-గేమ్ ఛేంజర్‌లుగా బీసీ ఓటర్లు
Bihar Election 2025: బిహార్ జనాభాలో 63% మంది ఓబీసీలు ఉన్నారు. వీరిలో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36% మంది. కాగా, బీసీలు 27% మంది. ఎస్సీలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%.

Bihar Election 2025: బిహార్ శాసన సభ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 22తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా నవంబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 2020లో జరిగిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ మూడు దశల్లో నిర్వహించింది. ఈ దఫా రెండు దశల్లోనే నిర్వహించాలన్న యోచనలోనూ ఉంది. దీపావళి, ఛత్ పూజ వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 243 శాసన సభ స్థానాల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.
ఎన్నికల సేవలు అందించేందుకు కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్
నకిలీ ఓటర్ ఐడీల తొలగింపునకు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ప్రస్తుతం ఓటర్ స్లిప్పులు, సీరియల్ నెంబర్లు, ఓటర్ల జాబితాలో పార్ట్ నంబర్లు ముద్రించడం వంటి పనులు చేపడుతున్నారు. ఎన్నికల సేవలకు సంబంధించి 40కి పైగా యాప్‌లను ఒకే డిజిటల్ వేదికగా ఏకీకరణ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ECI 'ECInet' అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎన్నికల కమిషన్ బిహార్ ఎన్నికల్లో ప్రవేశపెడుతోంది. ఈ వెబ్‌సైట్‌లో పార్టీ అభ్యర్థుల పూర్తి వివరాలు, ఓటర్లు అందించే సేవలు, ఎన్నికల ఫలితాలను చూసే అవకాశం కల్పిస్తోంది. క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ అధికారులకు, సిబ్బందికి, పార్టీల కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ఏఐ ద్వారా రూపొందించే ప్రచార సామగ్రి, డీప్‌ఫేక్ వినియోగం వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.
బిహార్ ఓటర్లు 8 కోట్లకు పైగానే...
2020లో జరిగిన బిహార్ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 7.29 కోట్లు. దాదాపు 78 లక్షలు నాడు తొలిసారిగా ఓటు వేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 2025 ఎన్నికల్లో బిహార్ జనాభా దాదాపు 13 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా. దాదాపు 8కోట్లకుపైగా ఓటర్ల సంఖ్య ఉండవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పూర్తి లెక్కలు ప్రకటించాల్సి ఉంది.
బిహార్లో మహిళా ఓటర్లే కీలక శక్తి
గత కొన్ని ఎన్నికల సరళిని గమనిస్తే క్రమక్రమంగా మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆ రాష్ట్ర మహిళా చైతన్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 2024 ఎన్నికల గణాంకాలు చూస్తే మనం ఇది గమనించవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల పోలింగ్ శాతం 53% కాగా, మహిళల పోలింగ్ శాతం 59.45% గా నమోదు కావడం విశేషం.
బిహార్ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ బీసీలే
ఈ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాలు రూపొందించుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలకు కీలకం ఆ రాష్ట్రంలోని కుల సమీకరణాలు. ఆ సామాజిక ఓటర్లను దృష్టిలో పెట్టుకునే అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ వ్యూహాలను, మేనిఫెస్టోలను రూపొందించుకుంటాయి. బిహార్‌లో ఇటీవలే జరిగిన కులగణన ప్రకారం బీసీ జనాభానే అధికం. బిహార్ జనాభాలో 63% మంది ఓబీసీలు ఉన్నారు. వీరిలో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36% మంది. కాగా, బీసీలు 27% మంది. ఎస్సీలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%. ఇక అగ్రకులాల వారు 15.52% మంది ఉన్నారు. వీరిలో బ్రాహ్మణులు 3.66%, రాజపుత్రులు 3.45%, భూమిహార్లు 2.86%, కాయస్థులు 0.60% ఉన్నారు. ఇక బీహార్‌లో ముస్లింలు 17.7% ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఓబీసీల్లో అతి పెద్ద సామాజిక వర్గం యాదవులు. వీరు 14.27% ఉన్నారు. ఆ తర్వాత కుర్మీలు 2.87%, ఎస్సీల్లో ఉన్న ముసాహార్లు 3% మంది ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.






















