లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు
Enforcement Directorate: మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఆరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న విచారణకు రావాలని కోరింది.
Delhi Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఆరోసారి. ఇప్పటివరకు ఐదుసార్లు విచారణకు రావాల్సిందిగా ఆయనను ఈడీ కోరింది. కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. తనకు వ్యక్తిగత పనులు ఉన్నాయంటూ ఇప్పటివరకు ఆయన విచారణకు హాజరుకాలేదు. ఆరోసారి నోటీసులు అందటంతో.. ఈ సారి కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈడీ సమన్లకు కేజ్రీవాల్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో ఈడీ నోటీసులు పంపిస్తూనే ఉంది. విచారణకు రాని కేజ్రీవాల్‌పై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. లోక్‌సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో కేజ్రీవాల్‌కు ఈడీ నుంచి నోటీసులు వస్తుండటంపై ఆప్ వర్గాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా చేసేందుకు ఇలా పదే పదే నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్‌ను చట్టవిరుద్దంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈడీ నోటీసుల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.
కేజ్రీవాల్ నోటీసులపై స్పందించకపోవడంతో ఫిబ్రవరి 3న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఉద్దేశపూర్వకంగానే విచారణకు డుమ్మా కొడుతున్నారని పిటిషన్‌లో పేర్కొంది. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే చట్టం పట్ల సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఈడీ తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఫిబ్రవరి 17న కోర్టు ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు ఎవరికైనా సమన్లు జారీ చేసే అధికారం ఈడీకి ఉందని పేర్కొంది. దీంతో 17న కేజ్రీవాల్ కోర్టు ముందు అటెండ్ కావాల్సి ఉండగా.. ఈ లోపు మరోసారి ఈడీ నోటీసులు పంపించింది. అయితే ఈడీ నోటీసులు చట్టవిరుద్దమని, అక్రమని కేజ్రీవాల్ అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేకమందిని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై కూడా అనేక ఆరోపణలు రావడంతో.. ఆయనకు నవంబర్ 1వ తేదీన తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 21న మళ్లీ సమన్లు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంతో ఈ ఏడాది జనవరి 3, జనవరి 18న, ఫిబ్రవరి 2న నోటీసులు జారీ చేసింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. కాగా లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను ఇరికిస్తున్నారని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే ఈడీ అరెస్ట్ చేసుకోవచ్చని, తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.