ED Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి మళ్లీ ఈడీ సమన్లు- ఈనెల 13న విచారణకు!
ED Summons to Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.
ED Summons to Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో గురువారం విచారణకు రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంతో మళ్లీ నోటీసులిచ్చింది. గురువారం నాటి ఈడీ విచారణకు హాజరుకావడం లేదని రాహుల్ సమాచారం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది.
Enforcement Directorate issues fresh summons to Congress leader Rahul Gandhi to appear before investigators on June 13 in National Herald case: Official sources
— ANI (@ANI) June 3, 2022
(file pic) pic.twitter.com/jKaQ3nzCES
ఇదే కేసులో జూన్ 8న విచారణకు హాజరుకావాల్సిన సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. సోనియా గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద వారిద్దరి వాంగ్మూలాలూ నమోదు చేయనున్నట్టు ఈడీ తెలిపింది.
ఇదీ కేసు
కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.
ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా తదితరులు ఉన్నారు.
Also Read: Corona Cases: 84 రోజుల తర్వాత 4 వేలు దాటిన కరోనా కేసులు- ఆ రెండు రాష్ట్రాల్లోనే