EC Big Action: ఈసీ కీలక నిర్ణయం, బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై వేటు
Lok Sabha Elections 2024: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతో పాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ఈసీ వేటు వేసింది.
EC removes Bengal DGP and home secretaries in 6 states: ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరగనున్న తరుణంలో ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ఈసీ వేటు వేసింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వారితో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డీజీపీపై సైతం ఈసీ వేటు వేసింది. బాధ్యతల నుంచి తప్పించాలని తాజా ఆదేశాలలో పేర్కొంది.
పలువురు ఉన్నతాధికారులపై ఈసీ కొరడా..
బృహన్‌ముంబయి మున్సిపల్ (BMC) కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చాహల్‌తో పాటు అడినషనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను సైతం బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రెండు రోజుల కిందట విడుదల కాగా, ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. వీరితోపాటు హిమాచల్ ప్రదేశ్, మిజోరం సాధారణ పరిపాలనా శాఖ (GAD) కార్యదర్శులను కూడా తొలగించాలని ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
The Election Commission of India (ECI) has issued orders for the removal of the Home Secretary in six states namely Gujarat, Uttar Pradesh, Bihar, Jharkhand, Himachal Pradesh and Uttarakhand. Additionally, the Secretary of the General Administrative Department in Mizoram and… pic.twitter.com/DxvZPPlbNz
— ANI (@ANI) March 18, 2024
ఎన్నికల విధులకు సంబంధించి రాష్ట్రాలకు ఈసీ ఆదేశాలు
ఎన్నికలకు సంబంధించిన విధుల్లో పాల్గొనే అధికారులు మూడేళ్లపాటు ఒకేచోట పనిచేసినా లేక వారి సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నట్లయితే వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని సీఈసీ రాజీవ్ కుమార్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. అధికారుల బదులీకి సంబంధించి రాజీవ్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది. పలు రాష్ట్రాల్లో మునిసిపల్ కమిషనర్లు, కొందరు అడిషనల్, డిప్యూటీ కమిషనర్లు ఈసీ ఆదేశాలను పాటించలేదు. దాంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధిత ఉన్నతాధికారులను బాధ్యతల నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై సోమవారం సాయంత్రం 6 గంటలలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా 7 దశలలో లోక్‌సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మార్చి 16న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభతో పాటు తెలంగాణ లోక్‌సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ రెండు రోజుల కిందట ప్రెస్ మీట్‌లో తెలిపారు. ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.