E-Passport System: భారత్‌లో ప్రారంభమైన ఈ-పాస్‌పోర్ట్ విధానం, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి
E-Passport System: ఈ-పాస్పోర్ట్: భారతదేశంలో ప్రారంభమైంది. ఇది మరింత సురక్షితం. దరఖాస్తు ఎలా చేయాలి? ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకోండి.

How to Apply for e-Passport: భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తూ, పాస్‌పోర్ట్ సేవా 2.0 కింద ఈ-పాస్‌పోర్ట్ వ్యవస్థను ప్రారంభించింది. ఇకపై కొత్త పాస్‌పోర్ట్ పొందాలన్నా లేదా పాత పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించుకోవాలన్నా, పౌరులకు చిప్ కలిగిన హై-టెక్ ఈ-పాస్‌పోర్ట్ లభిస్తుంది. ఇది ఇప్పటివరకు వాడుకలో ఉన్న కాగితపు పాస్‌పోర్ట్‌కు స్మార్ట్ వెర్షన్ అని చెప్పవచ్చు.
అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తయారు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం గుర్తింపును మరింత సురక్షితంగా మార్చడం, మోసాలను అరికట్టడం, విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం. అంటే రాబోయే రోజుల్లో పాస్‌పోర్ట్ కేవలం ఒక డాక్యుమెంట్ మాత్రమే కాదు, మీ డిజిటల్ గుర్తింపునకు సురక్షితమైన మార్గంగా మారుతుంది. ఇది ఎంత సురక్షితంగా ఉంటుందో, దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.
ఈ-పాస్‌పోర్ట్ ఎంత సురక్షితం?
ఈ-పాస్‌పోర్ట్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే దాని కవర్ లోపల అమర్చిన మైక్రోచిప్. ఈ చిప్‌లో ప్రయాణికుడి డిజిటల్ ఫోటో, వేలిముద్రలు, అవసరమైన బయోమెట్రిక్ సమాచారం సురక్షితంగా స్టోర్ చేసి ఉంటుంది. ఈ డేటా ఎన్‌క్రిప్టెడ్ చేసి ఉంటారు. దీనివల్ల దీన్ని నకిలీ చేయడం లేదా మార్పులు చేయడం చాలా కష్టం.
ఇది పాస్‌పోర్ట్ మోసం, నకిలీ గుర్తింపు, చట్టవిరుద్ధమైన ప్రవేశం వంటి కేసులను చాలా వరకు అరికడుతుంది. దీనితో పాటు, అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఈ-గేట్ ద్వారా స్కాన్ చేయగానే సమాచారం వెంటనే సిస్టమ్‌లోకి వస్తుంది. దీనివల్ల ఇమ్మిగ్రేషన్ త్వరగా పూర్తి అవుతుంది. క్యూలో ఎక్కువ సమయం ఎదురు చూసే బాధలు తపుతాయి.ప్రయాణం మునుపటి కంటే వేగంగా , సులభంగా ఉంటుంది.
దీని కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చాలా మందిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీ దగ్గర పాత పాస్‌పోర్ట్ ఉండి, అది చెల్లుబాటులో ఉంటే, వెంటనే మార్చుకోవాల్సిన అవసరం లేదు. అది గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతుంది. మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు లేదా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఈ-పాస్‌పోర్ట్ మీకు లభిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ మునుపటిలాగే ఉంటుంది. మీరు పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫారమ్ నింపాలి, అపాయింట్‌మెంట్ తీసుకోవాలి, సమీపంలోని కేంద్రంలో పత్రాలతో ధృవీకరణ చేయించుకోవాలి. ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు వంటి పత్రాలు అవసరం. దరఖాస్తుదారుడికి ఎటువంటి తీవ్రమైన నేర చరిత్ర ఉండకూడదు.
ఫీజు ఎంత ఉంటుంది?
ఈ-పాస్‌పోర్ట్ పొందడానికి ఫీజులో ఎటువంటి మార్పులు చేయలేదు. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ బుక్‌లెట్ కోసం ఫీజు రూ. 1500, 60 పేజీల బుక్‌లెట్ కోసం రూ. 2000గా నిర్ణయించారు. మీరు తత్కాల్ సేవను తీసుకుంటే, ఈ ఫీజు 36 పేజీలకు రూ. 3500, 60 పేజీలకు రూ. 4000కి పెరుగుతుంది. అర్హత విషయానికి వస్తే, భారతదేశ పౌరులెవరైనా, పిల్లలు లేదా వృద్ధులు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్‌లకు అపాయింట్‌మెంట్‌లో ప్రాధాన్యత కూడా ఇస్తారు. దీనివల్ల వారికి ప్రక్రియ సులభతరం అవుతుంది.





















