LPG Gas Price India: LPG ధరల్లో భారత్ నం.1, పెట్రోల్‌లో 3వ ర్యాంక్- బాదుడే బాదుడు, వీర బాదుడు!
ఎల్‌పీజీ ధరల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. పెట్రోల్ ధరల్లో 3వ స్థానంలో ఉంది.
దేశంలో ధరలు మండిపోతున్నాయి. ఓవైపు ఎల్‌పీజీ గ్యాస్ ధర, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎల్‌పీజీ గ్యాస్ ధరల్లో భారత్ టాప్‌లో ఉన్నట్లు తేలింది.
టాప్ లేపిన భారత్
వంట గ్యాస్‌గా ఉపయోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) ధరల్లో భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. విదేశీ మారక నిల్వలు అంతంతమాత్రంగానే ఉండే పేద దేశాల కన్నా కూడా భారత్‌లోనే గ్యాస్‌పై బాదుడు తీవ్రంగా ఉంది.
యుద్ధంతో అస్తవ్యస్తమైన ఉక్రెయిన్, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకతో పోల్చినా భారత్‌లో గ్యాస్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశాల కన్నా భారత్‌లో పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ ధరలు మాత్రం పెంచుతూనే ఉంది సర్కార్.
పీపీపీ ప్రకారం
అంతర్జాతీయ మానిటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) సంస్థ ఈ ఏడాది అంతర్జాతీయ డాలర్ లేదా పర్ఛేజింగ్ పవర్ పార్టీస్ (పీపీపీ) డాలర్ విలువను నిర్దేశించింది. భారత రూపాయల్లో దాని విలువ రూ.22.6గా ఉంది.
నిజానికి ఆయా దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులకు జరిగే లావాదేవీలను ఏ కరెన్సీలో నిర్వహిస్తారో దాని ప్రకారం అంతర్జాతీయ ధరలను పోల్చిచూసేవారు. కానీ ఇది చాలా నిత్యవసరాల విషయంలో భిన్నంగా ఉంటుంది.
ఉదాహరణకు భారత్‌లో పెట్రోల్ ధర చూస్తే లీటరుకు రూ.120. దాన్ని అమెరికా కరెన్సీలోకి మార్చి చూస్తే 1.58 డాలర్లు. అన్ని ఉత్పత్తులు, నిత్యావసరాలకు అమెరికా డాలర్‌ను ఆపాదించడం సరికాదని ఐఎమ్ఎఫ్ తెలిపింది. అందులో ఐఎమ్ఎఫ్ అంతర్జాతీయ డాలర్ (పీపీపీ) విలువను నిర్దేశించింది.
ఈ లెక్కలతో పోలిస్తే
పీపీపీ లెక్కలతో పోలిస్తే ఎల్‌పీజీ విలువలో భారత్ నంబర్ 1గా నిలిచింది. భారత్‌లో లీటర్ ఎల్‌పీజీ ధర 3.5 అంతర్జాతీయ డాలర్లు (పీపీపీ)గా ఉంది. ఇక పెట్రోల్ విషయంలోనూ భారత్‌లో లీటర్ ధర 5.2 పీపీపీ డాలర్లుగా ఉంది. పెట్రోల్ విషయంలో భారత్ మూడో స్థానంలో ఉంది.
రోజువారి ఆదాయంలో
ఒక వ్యక్తి రోజువారీ సగటు ఆదాయంతో పోలిస్తే ఓ అమెరికా పౌరుడు పెట్రోల్ కోసం 0.6% వెచ్చిస్తున్నాడు. భారత్‌లో దాదాపు పావు వంతు (23.5%) రోజువారీ ఆదాయాన్ని పెట్రోల్ హరిస్తోంది.
Also Read: Modi Congratulates New Pak PM: పాకిస్థాన్ ప్రధానికి తనదైన స్టైల్‌లో మోదీ శుభాకాంక్షలు
Also Read: Modi-Biden Virtual Meet: జో బైడెన్ - ప్రధాని మోదీ వర్చువల్ భేటీ, బుచా హత్యలపై విచారణకు డిమాండ్