Maoist Party Chief:అత్యంత రహస్యంగా మావోయిస్టు సారథి ఎన్నిక! నడిపించే నాయకుడు ఎవరు?
Maoist Party Chief:మావోయిస్టు పార్టీ చీఫ్ ఎన్నిక చాలా రహస్యంగా జరుగుతుంది. ఇందులో సీసీ , పొలిట్ బ్యూరో మెంబర్లే కీలకం. ఎన్నికైన తర్వాత ప్రకటించే విషయంలో గోప్యత పాటిస్తారు.

Maoist Party Chief: మావోయిస్టు పార్టీ అండర్ గ్రౌండ్ పార్టీ. ఆ పార్టీ ప్రతీ కార్యక్రమం చాలా అత్యంత రహస్యంగా జరుగుతుంది. అదే రీతిలో మావోయిస్టు పార్టీ ఎన్నిక కూడా అత్యంత రహస్యంగా జరిగే ప్రక్రియ. మావోయిస్టు పార్టీ ఏర్పడిన నాటి నుంచి 2018 వరకు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన వయోభారంతో ఆ పదవిని వీడటంతో పార్టీ తదుపరి ప్రధాన కార్యదర్శిగా పార్టీలో సీనియర్ అయిన నంబాల కేశవరావును నియమించింది. ఆ పార్టీకి ఆయన రెండో సారిథి. ఛత్తీస్‌గఢ్‌లోని అబుబ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో నంబాల కేశవరావు మృతి చెందడంతో ఇప్పుడు తదుపరి ఆ బాధ్యతలను పార్టీ ఎవరికి అప్పగిస్తుందన్న చర్చ సాగుతోంది. అయితే పార్టీకి గతంలో ప్రధాన కార్యదర్శి గణపతికే మళ్లీ అప్పగిస్తారని, లేదంటే పార్టీలో సీనియర్లు అయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుకు అప్పగిస్తారని, లేదంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీకి కట్టబెడతారన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ తరుణంలో పార్టీ చీఫ్ ఎన్నిక ఎలా సాగుతోందో ఇప్పుడు చూద్దాం.
మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ ఎన్నిక అత్యంత రహస్యం
మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ ఎన్నిక ఓ సీక్రెట్ గానే చెప్పాలి. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందన్న సమాచారం అందుబాటలో లేదు. పార్టీ బైలాస్ ఎలా ఉన్నయాన్న దానిపై ఎవరూ నోరు విప్పలేదు కానీ ఇది పార్టీలో అంతర్గతంగా బాగా చర్చించి నిర్ణయం తీసుకుంటారన్న వాదన మాజీ మావోయిస్టు సీనియర్ నేతల ద్వారా బహిర్గతమైంది. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యయుత పద్ధతిలోజరుగుతుందని చెప్తారు. ఈ ఎన్నికలో కేంద్ర కమిటీ కీలకమైంది. దీన్నే సీసీగా కూడా పిలుస్తారు. కేంద్ర కమిటీ సభ్యులే తదుపరి మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీకి చెందిన ముఖ్యమైన, నిర్ణాయత్మక విభాగం. పార్టీ నడిపించే ముఖ్యమైన ఇంజన్ గా చెప్పుకోవచ్చు. పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక విభాగం.
మావోయిస్టు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే సీసీ మెంబర్లు వీరే
మావోయిస్టు పార్టీలో ఎంత మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారం లేదు. మావోయిస్టు పార్టీగా 2004లో పురుడు పోసుకున్నప్పుడు 34 నుంచి 42 మంది వరకు మెంబర్స్ ఉండేవారు. ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లు, అనారోగ్య సమస్యలు కారణంగా ఈ సంఖ్యలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం 18 వరకు ఉండవచ్చని క్రీయాశీలకంగా పది పన్నెండు మంది మాత్రమే ఉన్నారని సమాచారం. తాజా నివేదికల ప్రకారం సీసీ మెంబర్లు వీరే
1. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి
2. మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను, అభయ్
3. మిసిర్ బెస్ట్సా
4. తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్ జీ
5. గాజర్ల రవి అలియాస్ ఉదయ్
6. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా
7. పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే
8. పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న
9. మల్లా రాజి రెడ్డి
10. మెడెం బాలకృష్ణ
ఎన్నిక తీరు ఇలా....
మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ఎంపికపై కేంద్రకమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరో కీలక పాత్ర పోషిస్తుంది. పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులతో కూడిన చిన్న బృందంగా ఉంటుంది. పార్టీ చీఫ్‌గా ఎవరు ఉండాలన్న దానిపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఏకాభిప్రాయం కోసం చర్చ సాగిస్తారు. ఏకాభిప్రాయం రాకపోతే రహస్య ఓటింగ్ జరుగుతుంది. ఇందులో సీసీ మెంబర్లు, పొలిట్ బ్యూరో మెంబర్లు తమ ఓటు వేసి పార్టీ జనరల్ సెక్రటరీని ఎన్నుకుంటారు.
ఎన్నికకు ప్రమాణాలు ఇవే..
మావోయిస్టు పార్టీని నడిపే రథసారథిని ఎన్నుకోవడం రహస్య పద్ధతిలో అయినా ఎన్నికకు చర్చకు వచ్చే అంశాలు మాత్రం కీలకమైనవి అని చెప్పాలి. మావోయిస్ట్ చీఫ్ గా ఎన్నిక అవ్వాలంటే పార్టీ సిద్దాంతాల పట్ల పట్టు ఉండాలి. పార్టీ నిర్మాణంలో నైపుణ్యాలను పరిశీలిస్తారు. పార్టీ అప్పగించిన బాధ్యతల్లో వారు సాధించిన విజయాలు, నాయకత్వ లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు. అజ్ఞాతంగా పార్టీని నడిపించడానికి, బలోపేతం చేయడానికి ఉన్న భవిష్యత్తు వ్యూహాలపైన చర్చ సాగుతుంది. వర్గ శత్రువు నిర్మూలన విషయంలో గతంలో చేసిన సైనిక ఆపరేషన్లు, భవిష్యత్తు వ్యూహాలపైన ఎన్నుకునే నాయకుడి అనుభవాలను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పరిగణలో తీసుకుంటారు.
మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్నికయితే ఎలా ప్రకటిస్తారు.?
మావోయిస్టు పార్టీ అన్ని విషయాలను రహస్యంగా ఉంచినట్లు పార్టీ సారథి ఎన్నిక తర్వాత కూడా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతుంది. ఎన్నిక పూర్తయ్యాక కొత్త సారథి ఎవరన్న విషయాన్ని పార్టీ రాష్ట్ర, జోనల్, ఏరియా కమిటీలకు, పార్టీ దళాలకు అంతర్గతంగా తెలియజేస్తారు. కొరియర్ వ్యవస్థను ఇందుకు వాడుకుంటారు. అయితే మరోవైపు పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థలు కూడా తమ కోవర్టులు లేదా కొరియర్లను అరెస్ట్ చేయడంతోపాటు ఇతర నెట్ వర్క్ ద్వారా మావోయిస్టు పార్టీ నాయకత్వ మార్పు విషయాన్ని పసిగడతాయి. మరి కొన్ని సందర్భాల్లో ఆయా స్థాయి నక్సలైట్లు పార్టీని వీడి రావడం లేదా కొరియర్లతో మీడియాకు ఉండే సంబంధాల ద్వారా కొత్త నాయకుడి పేరు బహిర్గతం అవుతుంది.






















