Kamal Haasan Controversy: తమిళం నుండి కన్నడ భాష పుట్టిందా? కమల్ హాసన్ వ్యాఖ్యల్లో నిజమెంత?
Kannada language origin | తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం – ఈ భాషలన్నీ ప్రోటో-ద్రావిడ భాష నుండి జనించాయి. ఇవి ఒక దానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి తప్ప ఒక దాని నుండి మరొకటి ఉద్భవించలేదు.

Kamal Haasans comments on Kannada Language: ద్రావిడ భాషల్లో అత్యంత పురాతన భాష తమిళం అని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే, ఇటీవల సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్‌గా మారాయి. తమిళ భాష నుండే కన్నడ భాష పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరకు ఇది న్యాయస్థానం వరకు చేరింది. అయితే, కమల్ హాసన్ భాషలపై చేసిన వ్యాఖ్యల సందర్భంగా అసలు మన దేశంలో ఈ భాషల ప్రాముఖ్యత ఏంటి, వాటి చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవే...
త్వరలో విడుదల కానున్న 'థగ్ లైఫ్' (Thug Life) సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ, "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కన్నడ సంఘాలు, కన్నడ రాజకీయ పార్టీలు, అక్కడి నేతలు కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కమల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినప్పటికీ, కమల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని చెప్పడంతో కన్నడిగులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. చివరకు ఈ వివాదం న్యాయస్థానంకు చేరింది. కమల్ వ్యాఖ్యలపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.
"మీరు ఏమైనా చరిత్రకారులా, భాషా పండితులా? కన్నడ భాష తమిళం నుండి పుట్టిందని ఎలా వ్యాఖ్యానిస్తారు?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. "ఒక్క క్షమాపణ చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేదా?" అని ప్రశ్నలు సంధించింది. అయినా కమల్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పకపోగా, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ద్రవిడ భాషల మూలాలు, వాటి చరిత్ర ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ద్రవిడ భాషలకు తల్లిలాంటిది ప్రోటో-ద్రావిడ
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తులు వంటి భాషలతో పాటు సుమారు 85 ద్రవిడ భాషలకు మూలం పురాతన ప్రోటో-ద్రావిడ. ద్రావిడ భాషలు నేరుగా ఒక దాని నుంచి మరొకటి ఆవిర్భవించలేదని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే, వేర్వేరు ద్రావిడ భాషలలో వ్యాకరణ నిర్మాణాలు, ఉమ్మడి పదాలు, ధ్వని మార్పులను అధ్యయనం చేసి విశ్లేషించడం ద్వారా ప్రోటో-ద్రావిడ అనేది మూలమని, ఇదే పూర్వ భాషగా తేల్చారు. ఈ భాషను సుమారు 4 వేల నుండి 4,500 సంవత్సరాల క్రితం మాట్లాడి ఉండవచ్చని భాషా శాస్త్రవేత్తల అంచనా. చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలు సింధు లోయ నాగరికత ప్రజలు ద్రావిడ భాషలు మాట్లాడి ఉంటారని, ఆ నాగరికత అంతమైన తర్వాత ఆ భాషలు అక్కడి నుండి దక్షిణ భారతానికి వచ్చాయని భావిస్తారు.
ప్రోటో-ద్రావిడ భాషల నుండే దక్షిణాది భాషల ఆవిర్భావం
ప్రోటో-ద్రావిడ భాష కాలం గడుస్తున్న కొద్దీ నేడు మనం మాట్లాడుకునే భాషలుగా రూపాంతరం చెందాయి. ఈ భాషలను భాషా శాస్త్రవేత్తలు నాలుగు రకాలుగా విభజించారు. దక్షిణ ద్రవిడ భాషలు, దక్షిణ మధ్య ద్రవిడ భాషలు, మధ్య ద్రవిడ భాషలు, ఉత్తర ద్రవిడ భాషలుగా వర్గీకరణ జరిగింది. ఇవన్నీ ప్రోటో-ద్రావిడ భాషల్లో ఉన్న సారూప్యతలు, పదాల ఉచ్చారణ, వాక్య నిర్మాణం, ధ్వనిలో సారూప్యతల వంటి వాటిని అధ్యయనం చేసి భాషా శాస్త్రవేత్తలు ద్రవిడ భాషలను వర్గీకరించారు.
1. దక్షిణ ద్రావిడ భాషలు: ఇందులో తమిళం, కన్నడ, మలయాళం, తులు, కొడుగు, తోడా, కోట, బడగ, ఇరుల, కొరగ, కుడియా వంటి భాషలు ఉన్నాయి. తమిళం ద్రావిడ భాషలలో అత్యంత ప్రాచీనమైనది, సుదీర్ఘ సాహిత్య చరిత్ర కలిగిన భాష. కన్నడం కర్ణాటక రాష్ట్ర అధికార భాష, దీనికి కూడా సుదీర్ఘ సాహిత్య చరిత్ర ఉంది. మలయాళం కేరళ రాష్ట్ర అధికార భాష. తుళు కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలలో, కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఎక్కువగా మాట్లాడతారు. కొడవ కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో మాట్లాడతారు. తోడా అనే భాషను నీలగిరి పర్వత ప్రాంత ప్రజలు తోడా ప్రజలు మాట్లాడుతునే భాష. కోట, ఇరుల, బడగ అనే భాషలు కూడా నీలగిరి పర్వత ప్రాంతంలో మాట్లాడతారు. కొరగ అనే భాషను కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతంలో మాట్లాడతారు. కుడియా అనే భాష తుళు భాషకు సంబంధించిన మరో ఉప భాష. తమిళం ఈ కుటుంబంలో అత్యంత పురాతనమైనది. క్రీ.పూ 3వ శతాబ్దం నాటి ప్రాచీన సాహిత్యం అయిన సంగం సాహిత్యం ఇందులోనే ఉంది. సుసంపన్నమైన సాహిత్య చరిత్రను కలిగిన భాష తమిళంగా చెప్పవచ్చు.
2. దక్షిణ-మధ్య ద్రావిడ భాషలు: ఇందులో తెలుగు, గోండి, కోయ, కుయి, కొండ, పెంగో, మండ వంటి భాషలు ఉన్నాయి. తెలుగు ద్రావిడ భాషలలో రెండవ అతిపెద్దది, దీనికి సా.శ. 6వ శతాబ్దం నాటి శాసనాల నుంచి గొప్ప సాహిత్య చరిత్ర ఉంది. గోండి భాషను ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో, ఒడిశా, గుజరాత్, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలలో చిన్న చిన్న ఏరియాల్లోని ప్రజా సమూహాలు మాట్లాడతాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో గోండి మాట్లాడే ప్రజలు ఉన్నారు. కొండ భాషను కొండ దొరలు మాట్లాడతారు. ఇది ఒక షెడ్యూల్డ్ తెగ. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మాట్లాడతారు. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల్లో ఈ భాషను మాట్లాడే వారు ఉన్నారు.
యునెస్కో మండ భాషను అంతరించిపోతున్న భాషల జాబితాలో ఉన్న భాషగా గుర్తించింది. ఈ భాషను ఒడిశాలోని కాలహండి జిల్లాలో, తుయాములు రాంపూర్ ప్రాంతాల్లో మండ భాషను మాట్లాడతారు. ఈ భాషపై ఒడియా భాష ప్రభావం ఎక్కువ ఉంది. అందుకే ఈ భాష అంతరించిపోయే అవకాశం ఉందని యునెస్కో చెబుతోంది. పెంగు భాషను కూడా ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లాలో పెంగు పొరాజ అనే సమూహం ప్రజలు మాట్లాడతారు. కుయి అనే భాష కూడా యునెస్కో చేత అంతరించిపోయే జాబితాలో ఉన్న భాషగా గుర్తించడం జరిగింది. ఈ భాషను ఏపీలోని కొన్ని ప్రాంతాల ప్రజలు, ఒడిశాలోని కంధాలు మాట్లాడతారు.
కువి అనేది ఒడిశాలోని కంధాలు మాట్లాడే రెండో భాషగా చెప్పాలి. ఈ భాష కూడా ఒడిశాతో పాటు ఏపీలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జిల్లాలో, ఒడిశాలోని గంజాం, కోరాపుట్, గజపతి జిల్లాల్లో ఉంది. ఈ దక్షిణ మధ్య ద్రవిడ భాషల జాబితాలో అతి పెద్ద భాషగా తెలుగును చెప్పుకోవాలి. ఏపీ, తెలంగాణలలో అధికారిక భాష తెలుగు. ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న భాషల్లో తెలుగు ఒకటి. గుంటూరు జిల్లాలో భట్టి ప్రోలు శాసనాలు క్రీ.పూ నాల్గవ శతాబ్దం నాటివి ఉన్నాయి. అంతే కాకుండా క్రీ.పూ 200 నాటి అమరావతి శాసనంలోనూ తెలుగు పదాలు కనబడతాయి. పూర్తి తెలుగు శాసనం క్రీ.శ 575లో రేనాటి చోడుల శాసనంలో కనిపిస్తాయి. ఇవి కడప జిల్లా ఎర్రగుడిపాడులో లభించింది. ఇదే తొట్ట తొలి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషగా తెలుగు మాట్లాడే వారు 14వ స్థానంలో ఉన్నారు.
3. మధ్య ద్రావిడ భాషలు: ఇందులో కొలామి, నాయకి, గదబ, పర్జి, ఒల్లారి వంటి భాషలు ఈ సమూహంలో ఉన్నాయి. గదబ భాషను ఒడిశా, ఏపీల్లో కొద్ది మంది మాట్లాడతారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొలామి, నాయకి అనే భాష కూడా కొలామికి దగ్గరగా ఉంటుంది. దీన్ని మహారాష్ట్రలో కొద్ది మంది, పర్జి-దురువా అనే భాషను ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఒల్లారిని ఒడిశాలలో మాట్లాడతారు. ఇవన్నీ గిరిజన భాషలుగా గుర్తించడం జరిగింది.
4. ఉత్తర ద్రావిడ భాషలు: కురుఖ్, మాల్తో, బ్రహుయ్ వంటి భాషలు ఈ శాఖకు చెందినవి. బ్రహుయ్ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాష. కురుఖ్, మాల్తో భాషలు మధ్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల్లో మాట్లాడే భాషలు. ఈ భాషలపై ఇండో-ఆర్యన్ భాషల ప్రభావం ఎక్కువగా పడిందని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు. మహాభారతంలోని "కరూశ", "కరూఖలే" అనే పదాలు కురుఖ్ వారినే సూచిస్తాయని కొందరు భాషావేత్తలు చెప్పే మాట. ఈ అంశం కూడా ఈ భాషల ప్రాచీనతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలా ద్రావిడ భాషలు ప్రాంతీయ భాషలుగా విడిపోయి, అక్కడి సాంస్కృతిక, సామాజిక మార్పులకు అనుగుణంగా మార్పు చెందాయి.
మరి కమల్ హాసన్ చేసిన తప్పేంటంటే...?
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం – ఈ భాషలన్నీ ప్రోటో-ద్రావిడ భాష నుండి జనించాయి. ఇవి ఒక దానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి తప్ప ఒక దాని నుండి మరొకటి ఉద్భవించలేదు. మలయాళం మాత్రం 9వ శతాబ్దంలో ప్రాచీన తమిళం నుండి ప్రత్యేక భాషగా విడిపోయింది. అయితే దీన్ని కూడా భాషా శాస్త్రవేత్తలు తమిళం నుండి మలయాళం పుట్టిందని చెప్పరు. అందుకు కారణం ప్రోటో-ద్రావిడ భాష నుండి ఇవన్నీ కాలానుగుణంగా వేర్వేరుగా అభివృద్ధి చెందాయే తప్ప వీటికి ఏ భాష కూడా మాతృకం కాదని, ద్రవిడ భాషలన్నీ కూడా ప్రోటో-ద్రావిడ నుండే ఉద్భవించాయని సూత్రీకరిస్తారు. అలాగే కన్నడ భాష కూడా ద్రవిడ భాషా కుటుంబంలో వేర్వేరు శాఖలుగా వర్గీకరించబడింది. వీటిని సోదర భాషలుగా భావిస్తారు తప్ప తమిళం వీటికి ఆధారం కాదు.
సినీ నటుడు కమలహాసన్ తమిళం, కన్నడం రెండు సోదర భాషలుగా చెప్పాల్సింది తప్ప, తమిళం నుండి పుట్టాయని చెప్పడం తప్పు. తమిళం, కన్నడం సోదర భాషలు అని చెప్పి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. ఇవి ప్రోటో-ద్రావిడ భాష నుండి వేర్వేరు మార్గాల్లో, వేర్వేరు సమయాల్లో విడిపోయి అభివృద్ధి చెందిన సోదర భాషలు. ఒకే తల్లిదండ్రుల నుండి పుట్టిన అన్నాదమ్ములు లేదా అక్కా చెల్లెళ్లుగా కమల్ హాసన్ అభివర్ణించి ఉండాల్సి ఉంది.






















