Operation Sindoor: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు, బీ కేర్‌ఫుల్!: లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్
DGMO AND 3 Service Chief Officers Press Meet | డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, త్రివిధ దళాధిపతులు ప్రస్తుత పరిస్థితి, ఆపరేషన్ సిందూర్‌పై పలు అంశాలు వెల్లడించారు.

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణా శిబిరాలను నాశనం చేయాలన్న స్పష్టమైన సైనిక లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్‌ను రూపొందించామని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి విధ్వంసం చేశాం. పాక్‌లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 5 ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసి సంపూర్ణంగా నేలమట్టం చేసి మట్టిలో కలిపేశాం. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం తీసుకొస్తామని DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, మేజర్ జనరల్ ఎస్ఎస్ శార్దా మీడియాతో మాట్లాడారు.
ఉగ్రవాదుల ఏరివేతకే ఆపరేషన్ సిందూర్
"ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన 26 మంది అమాయకులను దారుణంగా హతమార్చిన విధానం మీ అందరికీ తెలుసు. ఆ భయంకరమైన దృశ్యాలను, దేశ ప్రజలు చూసిన కుటుంబాల బాధను, భారత సాయుధ దళాలపై, అమాయక పౌరులపై ఇటీవల అనేక దాడులు జరిగాయి. ఉగ్రదాడులకు పాల్పడినవారిని, అందుకు ప్లాన్ చేసిన వారిని శిక్షించడానికి, ఉగ్రవాదులకు కేంద్రాలుగా మారిన శిబిరాలు, వారి శిక్షణా కేంద్రాలను నామరూపాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్‌ను రూపొందించారని DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు.
#WATCH | Delhi: DGMO Lieutenant General Rajiv Ghai says "...Those strikes across those nine terror hubs left more than 100 terrorists killed, including high value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf and Mudasir Ahmed that were involved in the hijack of IC814 and the… pic.twitter.com/IeH6Je6STE
— ANI (@ANI) May 11, 2025
పుల్వామా ఉగ్రవాదులు హతం
9 ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో IC814 హైజాక్, పుల్వామా ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ లాంటి వారు హతమయ్యారు. పాకిస్తాన్ నియంత్రణ రేఖను దాటి కాల్పులు జరిపి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అమాయక పౌరులపై పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల భారత సైన్యం కాల్పులు తిప్పికొట్టింది. మే 7-10 తేదీల మధ్య ఎల్‌ఓసీ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పులు, దాడుల్లో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మరణించారని’ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు.
భారత్, పాక్ బలగాలకు వ్యత్యాసం ఇదే..
భారత బలగాలు పాక్, పీఓకేలోని ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా దాడలులు జరిపాం, కానీ పాకిస్తాన్ మాత్రం అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడిందని ఐఏఎఎఫ్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ప్రతి దశలోనూ పాక్ ఆటలు కట్టించాం, మేం ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకు తెలిపేందుకు లాహోర్, గుజ్రవాలాలోని వారి రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్నారు.






















