RCB Victory Parade Stampede: హడావుడి ఏర్పాట్లు, ప్రణాళిక లేని అధికారులు , పోలీసుల లాఠీఛార్జ్: బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివే!
RCB Victory Parade Stampede:చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.

RCB Victory Parade Stampede: అదుపులేని జనసమూహం, ప్రణాళిక లేని అధికారులు, లాఠీచార్జి - ఈ మూడు కారకాలు కర్ణాటకలో చారిత్రాత్మక వేడుకగా జరగాల్సిన సంబరాన్ని విషాదకరమైన తొక్కిసలాటగా మార్చాయి.
"మేము ఏమి తప్పు చేశామో నాకు తెలియదు... మాకు టిక్కెట్లు ఉన్నాయి, అయినా లోపలికి వెళ్లనివ్వలేదు" అని కోపంగా ఉన్న RCB మద్దతుదారుడు చిన్నస్వామి స్టేడియం వెలుపల ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన తర్వాత IPL విజయోత్సవ వేడుక సంతాప సభగా మారిపోయింది.
గందరగోళానికి దారితీసింది ఏమిటి?
చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు.
స్టేడియం సామర్థ్యం 35,000 మంది ఉండగా, 2-3 లక్షల మంది హాజరయ్యారని, దీనివల్లే ఈ విషాద ఘటన జరిగిందని సిద్ధరామయ్య అన్నారు.
మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి ఆర్‌సిబి 18 సీజన్ల తర్వాత తొలి టైటిల్‌ను గెలుచుకుంది.
33 మంది ఆసుపత్రి పాలయ్యారని, అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ప్రయత్నించారని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
"ఇంత పెద్ద విజయోత్సవాన్ని నిర్వహించినప్పుడు... సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి" అని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా PTIకి తెలిపారు.
చిన్నస్వామి స్టేడియం వెలుపల క్రౌడ్ ఎలా పెరిగింది?
భారీ జనసమూహాన్ని నిర్వహించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో సహా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు వచ్చిన అభిమానులు లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు.
ఈ కార్యక్రమాన్ని హడావిడిగా ఏర్పాటు చేశారని అంటున్నారు. టిక్కెట్లు కూడా భారీ సంఖ్యలో జారీ చేసినట్టు వార్తలు వస్తునాయి. చిన్న స్వామి స్డేడియంకు ముందుగానే చేరుకున్న అభిమానులు అన్ని గేట్ల వైపు నుంచి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నంచేశారు. వారిని నియంత్రించడానికి తగినంత భద్రత ఏర్పాట్లు చేయలేదు.
మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ సంఖ్య ఊహించని స్థాయికి చేరుకుంది. టికెట్ లేని వారు చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు ఉన్న వారితోపాటు లోపలికి రాకుండా పోలీసులు, స్టేడియం భద్రతా అధికారులు అన్ని గేట్లను మూసివేయాల్సి వచ్చింది.
"మేము మా స్టార్‌లను చూడటానికి వచ్చాము. నేను వేడుక కోసం టిక్కెట్లు కొన్నాను కానీ స్టేడియంలోకి కూడా ప్రవేశించలేకపోయాను. పోలీసులు అకస్మాత్తుగా అన్ని రోడ్లను బ్లాక్ చేసి, వేదికకు అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేశారు, అకస్మాత్తుగా వారు ప్రధాన గేటు దగ్గర లాఠీ ఛార్జ్ చేయడం ప్రారంభించారు" అని తన స్నేహితులతో పాటు వచ్చిన ఓ పీజీ విద్యార్థి ప్రశాంత్ శెట్టి అన్నారు.
"మేము ఏమి తప్పు చేశామో నాకు తెలియదు. వేడుకకు మమ్మల్ని ఆహ్వానించారు, టిక్కెట్లు కొన్నాము కానీ చివరికి కొట్టి దుర్భాషలాడారు. మా లాంటి అభిమానులకు భయంకరమైన రోజు" అని ఆయన అన్నారు.
సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది, భారీ జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. 10వ గేటు వద్ద పరిస్థితి మరింత దారుణంగా మారింది. మహిళలు, పిల్లలు బలవంతంగా తోసేశారు. ఈ రిపోర్టర్‌ను కూడా ఒక పోలీసు అధికారి లాఠీతో నెట్టేశాడు. స్థానిక మాండలికంలో కొన్ని అసభ్య పదజాలంతో తిట్టారు. తొక్కిసలాట నుంచి సురక్షితంగా బయపడినప్పటికీ, టిక్కెట్లు కొనుగోలు చేసిన చాలా మంది ప్రజలు స్టేడియంలోకి వెళ్లకుండానే వెనుదిరిగారు.
మహిళలు స్పృహ కోల్పోవడాన్ని, మరికొందరు అభిమానులను తోసుకుంటూ వస్తున్న కాళ్ళ కింద నలిగిపోవడాన్ని కొన్ని వీడియోల్లో చూడొచ్చు. స్టేడియంలో జట్టుకు సన్మాన కార్యక్రమం దాదాపు గంటసేపు కొనసాగింది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జట్టు సభ్యులు హోటల్‌కు తిరిగి వెళ్లారు. అయితే అభిమానులు స్టేడియం దగ్గరే ఉండి ట్రాఫిక్‌ను మరింత అడ్డుకుని గందరగోళాన్ని సృష్టించారు. విషాదకరమైన రోజు తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.





















