Delhi Liquor Scam: విచారణలో ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణ
విచారణ సందర్భంగా కుటుంబ సభ్యులను ఈడీ భయాందోళనలకు గురిచేస్తోందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ధికారులు బెదిరింపులకు పాల్పడినట్లు న్యాయస్థానాలకు ఫిర్యాదు చేసినట్లు సంజయ్ సింగ్ తెలిపారు.
ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విమర్శించారు. విచారణ పేరుతో ఈడీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. దర్యాప్తు సంస్థ ప్రజల కోసం పనిచేయకుండా బీజేపీ కోసం పనిచేస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. విచారణ సందర్భంగా కుటుంబ సభ్యులను ఈడీ భయాందోళనలకు గురిచేస్తోందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ధికారులు బెదిరింపులకు పాల్పడినట్లు న్యాయస్థానాలకు ఫిర్యాదు చేసినట్లు సంజయ్ సింగ్ తెలిపారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్ పిళ్లై కుటుంబ సభ్యులను కూడా ఈడీ బెదిరింపులకు పాల్పడిందని సంజయ్ ఆరోపించారు. సమీర్ మహేంద్రలను, వారి కుటుంబ సభ్యులను ఈడీ ద్వారా బెదిరించారని తెలిపారు.
"విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి బిడ్డ, తల్లి, కుటుంబ సభ్యులను దర్యాప్తు సంస్థ ఈడీ భయాందోళనకు గురిచేయడమే పనిగా పెట్టుకుంది. ఇటీవలే చందన్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనని ఈడీ అధికారులు కొట్టారు, కుటుంబ సభ్యులను బెదిరించారని పిటిషన్లో పేర్కొన్నారు. చందన్ రెడ్డికి రెండు చెవులు వినిపించడం లేదు. ఈడీ విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇవన్నీ ఈడీ ఏ అధికారంతో చేస్తుంది? కొట్టడం ద్వారానే చెవులు వినపడడం లేదని డాక్టర్లు ధృవీకరించారు. అరుణ్ పిళ్లయ్ భార్య, బిడ్డ, కుటుంబ సభ్యులను కూడా భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇదే అంశాన్ని న్యాయస్థానానికి లేఖలో వివరించాను. సమీర్ మహేంద్రు భార్యను పిలిచి, ఆమెను, కుటుంబ సభ్యులను ఇలానే భయపెట్టారు. న్యాయస్థానం ముందు సమీర్ మహేంద్రు ఇవన్నీ చెప్పాడు. మరో ఇద్దరిని కూడా ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని సమాచారం మాకుంది. గౌరవ న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మాగుంట రాఘవ రెడ్డి కూడా ఇదే చెప్పాడు. రాజకీయనేతల పేర్లు చెప్పాలని భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నాడు." అని సంజయ్ సింగ్, ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికోసం, ఎవరి ఆదేశాల ప్రకారం ఈడీ పనిచేస్తోంది?- సంజయ్ సింగ్
ఈడీ విచారణలో భాగంగా భౌతికదాడులు చేస్తోంది. అధికారులతో పాటు ఈడీ కార్యాలయంలో ఎవరెవరు ఉంటున్నారు? చందన్ రెడ్డి చెప్పిన అంశం హైకోర్టులో ఉంది. మనీష్ సిసోడియా పీఎస్ రింకుకు ఫోన్ చేసి ఈడీ కార్యాలయానికి రావాలని పిలుస్తున్నారు. చట్టంలో స్పష్టంగా ఉంది.. నోటీసు ఇచ్చి పిలవాలని. ఫోన్ చేసి రా.. వచ్చి, పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చుని వెళ్లు అని చెప్తున్నారు. బిడ్డ కాలేజీకి ఎలా వెళ్తుందో చూస్తా అని ఈడీ అధికారులు ఎలా బెదిరిస్తారు? ఎనిమిదేళ్లలో ఈడీ 3000కు పైగా కేసులు నమోదు చేస్తే, అందులో శిక్షపడ్డవి కేవలం 0.5% మాత్రమే. నాకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈడీ అధికారులకు చెప్తున్నా..ఈ అంశాన్ని పార్లమెంట్ ముందుకు తీసుకువెళ్తా. అసలు లిక్కర్ స్కామే లేదు. పాయింట్ బ్లాంకులో గన్ పెట్టి అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారు.- సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ