Delhi Liquor Policy Scam Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు - 2న విచారణకు రావాలని ఆదేశాలు
అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందజేసింది. నవంబర్ 2న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందజేసింది. నవంబర్ 2న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను గత ఏప్రిల్‌లో సీబీఐ విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే.
మరోవైపు, ఇదే కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సోమవారం పెద్ద షాక్ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఆమ్ ఆద్మీ పార్టీని అణగదొక్కాలని కేంద్రం ప్లాన్ - ఢిల్లీ మంత్రి
అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు అందడంపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపిన తీరుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా నాశనం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమైందని అన్నారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ 56 ప్రశ్నలు
పీటీఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణ తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తన విచారణలో సీబీఐ అధికారులు 56 ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఉదయం 11.05 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరైన కేజ్రీవాల్ 9 గంటల పాటు విచారణ కొనసాగిన సంగతి తెలిసిందే. రాత్రి 8.15 గంటలకు ముగిసింది
అయితే, సీబీఐ అధికారులు అడిగిన ఆ 56 ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ నిజాయితీగల పార్టీ అని, తాము ఏ తప్పూ చేయలేదని అన్నారు. తనను అడిగిన 56 ప్రశ్నలు ఉత్తివే అని కొట్టిపారేశారు. ఇదంతా మొత్తం డర్టీ పాలిటిక్స్ అని కొట్టిపారేశారు.