Delhi Airport Fresh Advisory: ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ.. ఇవి పాటిస్తే నో ప్రాబ్లమ్
Delhi Airport operations issues travel advisory | విమాన ప్రయాణం చేసే వారికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ తాజాగా కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. వాటిని పాటించాలని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సూచించింది.

Delhi Airport | న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శనివారం జరిగింది. అమెరికా మధ్యవర్తిత్వం చేయగా.. డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన రిక్వెస్ట్ మేరకు ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం తరువాత సైతం ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది.
ఆదివారం తెల్లవారుజామున 2:42 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ విమాన ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దాని ప్రకారం, ఢిల్లీ విమానాశ్రయం కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. అయితే, మారుతున్న వాయుమార్గం వివరాలు, పౌర విమానయాన భద్రతా బ్యూరో ఆదేశించిన పెరిగిన భద్రతా ప్రోటోకాల్స్ దృష్ట్యా కొన్ని విషయాలు గమనించాలని సూచించింది. విమాన ప్రయాణ సమయాలలో సర్దుబాట్లు, భద్రతా తనిఖీల (Security Checking) వద్ద ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉండవచ్చు అని తెలిపింది.
Passenger Advisory issued at 02:42 Hours#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory pic.twitter.com/5Riv9Ehi9T
— Delhi Airport (@DelhiAirport) May 10, 2025
ఎయిర్ లైన్స్ ఇచ్చే గైడ్‌లైన్స్ పాటించాలి..
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఇటీవల దేశంలోని కొన్ని విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసి, సర్వీసులు సైతం రద్దు చేయడం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన శనివారం సాయంత్రం చేయగా.. ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం తెల్లవారుజామున ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసింది. ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థల కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా అప్‌డేట్ అవ్వాలి. క్యాబిన్, చెక్-ఇన్ బ్యాగేజీకి నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి. చెకింగ్ కారణంగా మరింత సమయం వేచి ఉండాల్సి వస్తుంది కనుక మరికాస్త ముందుగానే ఢిల్లి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. విమానయాన, భద్రతా సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని, విమానయాన సంస్థ లేదా అధికారిక ఢిల్లీ విమానాశ్రయ వెబ్‌సైట్ ద్వారా విమానం ప్రస్తుత స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక సమాచారం, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఎయిర్ లైన్స్ ఇచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను పట్టించుకోకూడదని సలహా ఇచ్చింది.
శనివారం రాత్రి 8:25 నుండి 8:45 గంటల వరకు పూణే విమానాశ్రయంలో అత్యవసర పవర్ షట్‌డౌన్ డ్రిల్ నిర్వహించారు. విమానాశ్రయంలో సన్నద్ధత, పవర్ కట్, ఇతర అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందన కోసం చెక్ చేయడమే ఈ డ్రిల్ లక్ష్యం. ఆ సమయంలో వచ్చిన విమానాలు 20-30 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.
మే 15 వరకు విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా మే 15 ఉదయం వరకు 32 విమానాశ్రయాలు మూసివేస్తారు. భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI), విమానయాన అధికారులు, ఉత్తర భారత్, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు నోటీసులను జారీ చేశారు. ఆపరేషనల్ కారణాలతో మే 9 నుండి మే 14, 2025 వరకు NOTAM అమలులో ఉంటుంది.
32 విమానాశ్రయాల జాబితాలో అమృత్‌సర్, అవంతిపూర్, బాటిండా, ఉధంపూర్, జోధ్‌పూర్, అంబాలా, భుజ్, బికనెర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, పఠాన్‌కోట్, పటియాలా, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కెషోద్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లూధియానా, ముండ్రా, నాలియా, శ్రీనగర్, థోయిస్, పోర్బందర్, రాజ్‌కోట్ (హిరసర్), సర్సావా, షిమ్లా మరియు ఉత్తర్లై ఉన్నాయి.
బారముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రదేశాలలో పాకిస్తాన్ డ్రోన్‌లతో దాడికి యత్నించగా భారత బలగాలు వాటిన గాల్లోనే పేల్చేవేసి, నిర్వీర్యం చేశాయని రక్షణ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ (LoC) వద్ద పాక్ సైన్యం దాడులు చేసింది.
శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, బారముల్లా, జమ్మూ, పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, ఫజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, భుజ్, బార్మెర్, కువార్బెట్, లాఖీ నాలా ఏరియాలో పాక్ డ్రోన్ దాడులు చేయగా భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది.






















