Deep Fake Photos: డీప్ ఫేక్ ఫోటోలను ఇలా గుర్తించండి - వీడియో షేర్ చేసిన కేంద్రం
Deepfake Images: ప్రస్తుత సాంకేతిక యుగంలో డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు కలవర పెడుతున్న వేళ కేంద్రం ఓ వీడియో విడుదల చేసింది. చిన్న చిన్న అంశాల ఆధారంగా నకిలీ వీడియోలు, ఇమేజెస్ గుర్తించొచ్చని తెలిపింది.
Central Government Video On Identifying Deepfake Images: డీప్ ఫేక్... ప్రస్తుతం అందరికీ ఆందోళన కలిగిస్తోన్న అంశం. డీప్ ఫేక్ ఫోటోలు (Deepfake Photos), వీడియోలు ఎన్నో రంగాలకు ప్రస్తుతం ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇటీవల పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించి డీప్ ఫేక్ వీడియోలు (Deepfake Videos) కలకలం సృష్టించాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) మానవాళి సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి కాగా.. అంతే స్థాయిలో ప్రమాదకరంగానూ పరిణమించిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు, నకిలీలను గుర్తించేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (Press Information Bureau) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఎలాంటి టెక్నాలజీ కూడా అవసరం లేకుండా చిన్న చిన్న అంశాల ఆధారంగా ఏఐతో సృష్టించే డీప్ ఫేక్ ఫోటోలను గుర్తించొచ్చని చెబుతోంది. వీడియోలు, ఫోటోలను పూర్తిగా పరిశీలిస్తే.. నకిలీవి, వింత వింత లైటింగ్, నీడలు, చిత్రాల్లో అసమానతలు వంటి తప్పులను గుర్తించొచ్చని తెలిపింది. షేర్ చేసిన వీడియోలో దీనికి సంబంధించి ఒక్కో అంశాన్ని సునిశితంగా వివరించింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఫేక్ వీడియోలు ఇలా గుర్తించండి
Become an image detective! Spot AI-generated images like a pro!
— PIB Fact Check (@PIBFactCheck) May 20, 2024
Watch this video to find out how to look for the details while identifying any AI-generated images#PIBFactcheck @MIB_India
@DDNewslive pic.twitter.com/uGFEIILmcQ
- కృత్రిమ మేధ ఆధారంగా నకిలీ ఫోటోలో మనుషుల శరీర తీరు వాస్తవానికి విరుద్ధంగా ఉంటుందని.. కాలి, చేతివేళ్లు అసహజంగా కనిపిస్తాయని పేర్కొంది.
- అలాగే, ఎడిట్ చేసిన ఫోటోల్లో నీడలు తేడాగా ఉంటాయని తెలిపింది. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏది వాస్తవమో, ఏది నకిలీనో కనిపెట్టొచ్చని సూచించింది.
- ఇటీవల కొందరు సినీ సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపాయి. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం డీప్ ఫేక్ వీడియోలు, ఇమేజ్ లు, నకిలీలను అడ్డుకునేందుకు కొత్త ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తామని తెలిపింది.
- కాగా, లోక్ సభ ఎన్నికల తర్వాత దీనిపై చట్టం తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.