Kallakurichi Issue: పెరుగుతున్న తమిళనాడు కల్తీసారా మృతుల సంఖ్య- సీబీసీఐడీ విచారణకు స్టాలిన్ ఆదేశం- జిల్లా కలెక్టర్, ఎస్పీపై చర్యలు
Tamil Nadu Illicit Liquor:తమిళనాడులోని కళ్లకురిచి కల్తీసారా మృతుల సంఖ్య 30కి చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడీ విషయం రాజకీయంగా కూడా పెను దుమారం రేపనుంది.
Tamil Nadu hooch tragedy: తమిళనాడులోని కళ్లకురిచి ఘటన పెను విషాదంగా మారుతోంది. గంటలు గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి కల్తీ సారా తాగి 30 మంది వరకు మృతి చెందారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మందికి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యలు చెబుతున్నారు.
కల్తీ సారా తాగి కళ్లకురిచి ఆసుపత్రిలో చేరుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ కల్తీసారా ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పలువులు అధికారులను సస్పెండ్ చేసింది. జిల్లా కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జాతావత్‌ను బదిలీ వేటు వేసింది. మరణాలపై సమాచారం తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంది. ఎస్పీ సమయసింగ్ మీనాను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీళ్లతోపాటు మరో 9 మంది పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు సీనియర్ అధికారులను కళ్లకురిచి పంపించింది. ఎంఎస్ ప్రశాంత్‌ను ఆ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఎస్పీగా రజత్ చదుర్వేదీని ఎస్పీగా తీసుకొచ్చింది.
కల్తీ సారా దుర్ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. " కళ్లకురిచిలో కల్తీ సారా తాగిన ప్రజలు చనిపోయారన్న విషాద వార్త విన్న నేను షాక్‌కి గురయ్యాను. ఈ క్రైమ్‌లో ఉన్న వారందర్నీ అరెస్టు చేస్తాం. ఇలాంటి విషయాలను నియంత్రించాల్సిందిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికాలుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఈ క్రైమ్‌లో ఉన్న వారి సమాచారాన్ని ప్రజలు ఇవ్వగలిగితే వెంటనే చర్యలు ఉంటాయి. సొసైటీని నాశనం చేసే ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం" అని Xలో స్టాలిన్ పోస్టు పెట్టారు.
అధికారికంగా మాత్రం 25 మంది చనిపోయినట్టు జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. మీడియాతో మాట్లాడి కలెక్టర్ ప్రశాంత్ 25 మంది చనిపోయారని వెల్లడించారు. మరికొంత మంది కుళ్లకురిచి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ బాధితులంతా బుధవారం ఆర్క్ ప్యాకెట్ల పేరుతో ఉన్న కల్తీ సారా తాగారని వెల్లడించారు.
ఇప్పటికే పలువురు సారా అమ్మేవాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 200 లీటర్ల కల్తీ సారా సీజ్ చేశారు. దాన్ని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేస్తే అందులో మిథనాల్ కలిపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీన్నే ప్యాక్ చేసి అమ్ముతున్నారు. జూన్ 19న ఈ ప్యాకెట్లు తాగిన వారంతా వాంతులు అవుతున్నట్టు కడుపులో నొప్పి ఉన్నట్టు ఆసుపత్రిలో చేరారు.
సారా ఇష్యూపై రాజకీయ దుమారం రేగుంతోంది. ప్రభుత్వం చేతకాని తనం వల్ల అమాయకులు బలైపోయారని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై చర్చించాలని పట్టుబడుతున్న వేళ కచ్చితంగా సభను ఈ అంశం కుదిపేయనుంది.