COVID Vaccine: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. మీరు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేస్కోండి
జనవరి 2వ తేదీ మధ్యాహ్నం సమయానికి దాదాపు 4.5 లక్షల మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు టీనేజీ పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ నేటి నుంచే మొదలయింది. ఇప్పటికే ఇందుకోసం జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు. కొవిన్ యాప్ లేదా వెబ్ పోర్టల్‌లో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారికి రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలుకాగానే దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జనవరి 2వ తేదీ మధ్యాహ్నం సమయానికి దాదాపు 4.5 లక్షల మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టీకా నమోదు ఇలా చేసుకోవాలి
* ముందుగా కోవిన్ యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఓటీపీని పొంది ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వొచ్చు.
* ఏదైనా ఒక ఫోటో ఐడీ ప్రూఫ్‌ని ఎంచుకొని.. దానికి సంబంధించి ఐడీ నంబర్, పేరు, లింగం, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
* తర్వాత, మీరు ఉండే ఏరియా పిన్ కోడ్‌ను నమోదు చేస్తే దగ్గర్లో ఉండే టీకా కేంద్రాల లిస్టు వస్తుంది. దగ్గరి టీకా కేంద్రం, తేదీ, టైం సెలెక్ట్ చేసుకొని ఆ సమయానికి వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లాలి.
* అక్కడికి వెళ్లాక రిఫరెన్స్ ఐడీని ఆరోగ్య సిబ్బందికి అందించాలి. అలాగే, మీ ఫోన్ నెంబరుకు ఇతర వ్యక్తులను కూడా ఇలాగే యాడ్ చేసుకొచ్చు.
మన దేశంలో కోవాక్సిన్ టీకాను 12 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు అత్యవసర ఉపయోగం కోసం డీజీసీఏ ఆమోదం తెలిపింది. అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డ్రగ్స్ కంట్రోలర్ 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అత్యవసర ఉపయోగం కోసం భారత్ బయోటెక్ కోవాక్సిన్‌ను ఆమోదించినప్పటికీ, ప్రభుత్వం 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్రమే టీకాలు వేయడం ప్రారంభించాలని నిర్ణయించింది.
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో క్వారంటైన్‌లోకి టీపీసీసీ చీఫ్