Covid-19 Review Meeting: కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ సమీక్ష, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కీలక సూచనలు
PM Modi Meeting on Covid 19: దేశంలో కరోనా స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సైతం సూచించారు.
PM Modi Holds High Level Meeting To Review Coronavirus Situation: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు కొత్త ఇన్ ఫ్లూయెంజ వైరస్ ల వ్యాప్తితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (మార్చి 22న) దేశంలో కరోనా స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న కరోనా వ్యాప్తి, హెచ్‌ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులపై చర్చించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి మోదీ, దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సైతం సూచించారు.
ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో పెరుగుతున్న కేసులపై ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారని పిటిఐ రిపోర్ట్ చేసింది. ఇన్‌ఫ్లుయెంజా పరిస్థితిపై, ముఖ్యంగా గత కొన్ని నెలలుగా దేశంలో నమోదవుతున్న హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసుల సంఖ్య పెరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. అయితే మూడేళ్ల కిందట 2020 తరహాలోనే ప్రజలు శ్వాస వ్యవస్థకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం, దేశంలో 1,134 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మొత్తంగా 7,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
In review meeting, PM Modi stresses on need to follow respiratory hygiene, adherence to Covid-appropriate behaviour: Statement
— Press Trust of India (@PTI_News) March 22, 2023
ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పీఎంఓ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. గత 24 గంటల్లో దేశంలో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కోవిడ్ -19 మరణాల సంఖ్య 5,30,813 కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చనిపోయారు. కోవిడ్-19 కేసుల పెరగడంతో, కేరళ ప్రభుత్వం అన్ని జిల్లాలకు మధ్యంతర హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా కేసుల చికిత్స కోసం కేంద్రం ఇటీవల సవరించిన మార్గదర్శకాల ప్రకారం, ప్లాస్మా థెరపీని ఉపయోగించవద్దని వైద్యులకు సూచించింది. లోపినావిర్ - రిటోనావిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, మోల్నుపిరావిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్ తో పాటు డాక్సీసైక్లిన్ మెడిసిన్ ను వయోజనులకు కోవిడ్-19 చికిత్సలో భాగంగా వినియోగించకూడదని మార్గదర్శకాలలో పేర్కొంది. ఇన్ ఫెక్షన్ సోకిందని నిర్ధారణ అయితేనే యాంటీ బయాటిక్స్ వాడాలని సూచించింది. శ్వాస సమస్య తలెత్తితే మాత్రం సీరియస్ గా తీసుకోవాలని, 5 రోజులపాటు జ్వరం అలాగే ఉండి తగ్గకపోయినా వైద్యులు జాగ్రత్తగా ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలలో కేంద్ర వైద్యశాఖ పేర్కొంది.