MP Adhir Ranjan: బీజేపీ, టీఎంసీ మధ్య బంధం ఉందన్న కాంగ్రెస్- బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు డిమాండ్
కేంద్రంలోని బీజేపీకి, టీఎంసీ మధ్య బంధం ఉందని ఆరోపించారు కాంగ్రెస్ అధిర్ రంజన్ చౌదరి. బెంగాల్‌లో ఈడీ అధికారులపై దాడిని ఖండిస్తూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.
![MP Adhir Ranjan: బీజేపీ, టీఎంసీ మధ్య బంధం ఉందన్న కాంగ్రెస్- బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ Congress MP Adhir Ranjan claims Modi Mamata Have a Connection and demands Presidents rule in Bengal MP Adhir Ranjan: బీజేపీ, టీఎంసీ మధ్య బంధం ఉందన్న కాంగ్రెస్- బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/06/62ffd37f08ce5e7b39e2401da1c203a21704540192443841_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
MP Adhir Ranjan Fire on Mamatha: బెంగాల్‌లో ఈడీ అధికారులపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ (Congress) ఎంపీ అధిర్ రంజన్ చౌదరి. సందేశ్‌ఖలీ ఘటన వెనుక ఎవరున్నారో మమత మౌనమే చెప్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సర్కార్‌కు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్‌కి మధ్య సంబంధం ఉందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై మూకుమ్మడి దాడి విషయంలో ఆయన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈ దాడి సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)నే కారణమని నేరుగా ఆరోపించారు. ఈడీ అధికారులపై జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు అధిర్ రంజన్ చౌదరి. దీన్ని బట్టే ఈ ఘటన వెనక ఎవరి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఉందో రుజువవుతోందన్నారు. మమతా బెనర్జీ మద్దతు లేకుండా... ఈడీ అధికారులపై దాడి జరిగేదే కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు ధైర్యం లేదంటూ మండిపడ్డారు.
బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే ఏదో ఒకటి చేయాలి
బెంగాల్‌లో ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు, సామాన్యులు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ దాడులకు గురవుతున్నారన్న కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి... ఈసారి ఏకంగా కేంద్ర దర్యాప్తు బృందం సభ్యులపైనే తృణమూల్ నేతలు దాడులు చేశారని ఆరోపించారు. ఇది చాలా అవమానకరమైన చీకటి రోజని ఆయన అభివర్ణించారు. బెంగాల్‌లో తృణమూల్ గూండా కాకాబాబు, ఖోకాబాబు, షాజహాన్, నూర్జహాన్‌లకు కొదవే లేదని... బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే ఏదో ఒకటి చేయాలన్నారు. అయినా... మణిపూర్‌లోనే ఏమీ చేయలేకపోయిన కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌లో ఏం చేస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ. కనీసం.. దాడి జరిగిన ప్రాంతంలో అయినా రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నామన్నారు అధిర్ రంజన్ చౌదరి.
మోడీ, దీదీ మధ్య బాండింగ్ ఉంది
కేంద్రంలోని మోడీ సర్కార్ మాటల వరకే పరిమితమవుతుందని.. చేతల్లోనే దిగలేదని విమర్శించారు. బహుశా మోడీ, దీదీ మధ్య బలమైన సంబంధం ఉండి ఉండొచ్చని.. అందుకే ఏమీ చేయలేకపోతున్నారని ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై దాడి చేసిన ఘటన దేశంలోనే ఎక్కడా జరగలేదన్నారు. పోకిరీలకు అంతటి దమ్ము వచ్చిదంటే... అది బెంగాల్‌లో అధికార పార్టీకి, పోలీసులకు మధ్య ఉన్న సంబంధాన్ని రుజువు చేస్తుందన్నారు. సందేశ్‌ఖాలీ ఘటనతో ఈ అపవిత్ర బంధం ప్రతిబింబిస్తోందని అన్నారు అధిర్ రంజన్. బెంగాల్‌లో రోజురోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నా... కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం మౌనం పాటిస్తోందన్నారు. ఈ దాడి కేవలం ఈడీ అధికారులపై మాత్రమే కాదని... భారతదేశ న్యాయ వ్యవస్థపైనే జరిగిందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.
షేక్ షాజహాన్ ఇంట్లో ఈడీ సోదాలు
నిన్న (జనవరి 5వ తేదీ) శుక్రవారం ఉదయం సందేశ్‌ఖాలీలోని తృణమూల్ నేత షేక్ షాజహాన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడంతో సెంట్రల్ ఆర్మీ జవాన్లు ఇంటి తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వందలాది మంది దుండగులు సెంట్రల్ ఫోర్స్ జవాన్లు, ఈడీ అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు ఈడీ అధికారుల తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత ఈడీ అధికారులు కారులో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కారు ఆపి మళ్లీ దాడి చేశారు దుండగులు. ఈడీ అధికారుల కారును ధ్వంసం చేశారు. దీంతో,,, తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆటో రిక్షాలో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈడీ అధికారులు. దాడి తర్వాత ఆ ప్రాంతంలోని వివిధ రహదారులపై చెట్ల కొమ్మలను పడేసి.. రోడ్లను దిగ్బంధించారు.
ఈడీ అధికారులపై దాడి ఘటనను గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఖండించారు. ఈ ఘటన భయంకరమైందని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. క్రూరత్వం, హింసను అరికట్టడం ప్రభుత్వ బాధ్యతని... ప్రభుత్వం తన ప్రాథమిక విధులను నిర్వర్తించలేకపోతే... రాజ్యాంగం దాని మార్గంలో నడుస్తుందని చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు గవర్నర్‌గా తనకు రాజ్యాంగబద్ధమైన అన్ని హక్కులు ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు జరిగే ఈ హింసను వెంటనే అంతం చేయాలన్నారు. ఈ హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని గవర్నర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న ఈడీ అధికారులను కూడా ఆయన పరామర్శించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)