లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్-విపక్షాలతో మంతనాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఏకపక్షంగా అనర్హత వేటు వేశారని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.
No-confidence Motion : రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ అధికార బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్‌గాంధీపై వేటు వేశారంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలంతా మంగళవారం ఉదయం సమావేశమై ఈ విషయంపై చర్చించారు.
ఏప్రిల్ 3న అవిశ్వాసం?
ఏప్రిల్ 6వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. ఈ లోగా ప్రాంతీయ పార్టీలతో కలిసి స్పీకర్‌పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచన చేస్తోంది. ఏప్రిల్ 3వ తేదీన సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఈ నెల 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయమై అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇచ్చింది. అయితే కోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఈ చర్యను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు బీజేపీయేతర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలోనే సోమవారం కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ తదితర ప్రాంతీయపార్టీలు పాల్గొని మద్దతు ఇచ్చాయి. అనంతరం రాహుల్ గాంధీ అనర్హత వేటు, అదానీ అంశంపై జేపీసీ వేయాలన్న తమ డిమాండ్ నేపథ్యంలో లోక్‌సభలో అనుసరించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు సహా ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు.
2024 ఎన్నికల్లో కలిసి పోటీకి ప్రయత్నాలు
వీరంతా కలిసి పార్లమెంట్‌లో ప్రభుత్వంపై పోరాడడమే కాక.. ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), సమాజ్‌వాదీ, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఆప్, జేడీయూ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్, ఆర్‌ఎస్పీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, వీసీకే, జేఎంఎం పార్టీల మధ్య ఇప్పటికే కీలక చర్చలు సాగుతున్నాయి. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన విందు సమావేశంలో శివసేన తప్ప మిగతా పార్టీలన్నీ హాజరయ్యాయి. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే ఉద్యమంలో పాల్గొంటామని శివసేన కూడా ప్రకటించింది. తాము చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి 19 పార్టీల మద్దతు లభించిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు.
రాహుల్ కేసులో అప్పీల్‌పై తమ లీగల్ టీమ్ పనిచేస్తోందని తెలిపారు. శివసేనతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుంటామని.. ఆ పార్టీ మద్దతు కూడా తమకు ఉందని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కాగా, రాహుల్‌పై వేటు నేపథ్యంలో ఏకతాటిపైకి వచ్చిన విపక్షాల ఐక్యతను 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించేలా ప్రతిపక్ష పార్టీల అధినేతలతో ఏప్రిల్‌లో భేటీ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
నెలరోజులపాటు నిరసనలు
రాహుల్‌పై అనర్హత, అదానీ అంశాలపై.. ‘జై భారత్ మహా సత్యాగ్రహ’, ‘లోక్‌తంత్ర బచావో మషాల్ శాంతి మార్చ్ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ కాగడాలతో చేసే శాంతి ర్యాలీ) .. ఇలా పలు రకాల నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నెల రోజులపాటు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. ‘జై భారత్ మహా సత్యాగ్రహ’లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని బ్లాక్/మండల స్థాయి కాంగ్రెస్ విభాగాలూ ‘వీధి సమావేశాలు’ నిర్వహించి అదానీ విషయంలో మోదీ సర్కారు తీరు గురించి, రాహుల్‌పై అనర్హత వేటు గురించి ప్రజలకు తెలుపుతారని వెల్లడించింది. మార్చి 31న అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలు, ఏప్రిల్ 1న అన్ని బ్లాక్‌లు/మండలాల్లో జిల్లా స్థాయి నేతలు పత్రికా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపింది. ఏప్రిల్ 3న అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ కాంగ్రెస్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాలు గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారని వివరించింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి యువ కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్‌యూఐ కలిసి ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధిస్తూ పోస్టు కార్డులు పంపుతారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 20 దాకా జిల్లా స్థాయిలో జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమాన్ని కలెక్టరేట్ల వద్ద నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమంలో భాగంగా.. పార్టీ సీనియర్ నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. ఏప్రిల్ రెండో వారంలో ఢిల్లీలో జై భారత్ మహా సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన చెప్పారు.