Collegium vs NJAC: కొలీజియం వ్యవస్థ రద్దు కానుందా? సుప్రీంకోర్టుకు, మోదీ ప్రభుత్వానికి మధ్య ఈ వివాదం ఎందుకు ?
Collegium vs NJAC: న్యాయమూర్తులపై పేర్లపై కేంద్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను కొలీజియానికి చెప్పవచ్చు. అయితే కొలీజియం మళ్లీ ఆ పేర్లను ప్రభుత్వానికి పంపితే మాత్రం ఆమోదించక తప్పదు.
Collegium vs NJAC: భారత్‌లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఇది పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.
కేంద్రమంత్రి రాసిన లేఖపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఇది ప్రమాదకరమని, న్యాయ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. అదే సమయంలో ప్రస్తుతం నడుస్తున్న కొలీజియం వ్యవస్థను కొనసాగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తోంది. ఇంతకీ ఇప్పుడున్న వ్యవస్థను కేంద్రం ఎందుకు వద్దంటోంది... సుప్రీంకోర్టు కొలీజియం ఎలా పనిచేస్తుందో చూద్దాం.
కొలీజియం వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
దేశంలో 1993 నుంచి న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం విధానం అమల్లో ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఈ కొలీజియం వ్యవస్థలో భాగంగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీలను కేంద్ర ప్రభుత్వానికి ఈ కొలీజియం సిఫార్సు చేస్తుంది. అదే సమయంలో హైకోర్టు కొలీజియంలో సీజేఐతోపాటు హైకోర్టుకు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగంలో మార్గదర్శకాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల వల్ల ఏర్పడిన వ్యవస్థ ఇది. కొలీజియం వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అలాంటి పాత్ర ఉందని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కావడానికి ఒక న్యాయవాది పేరును సూచిస్తే... ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆ న్యాయవాది గురించి సమాచారాన్ని తీసుకోవచ్చు. ఈ పేర్లపై కేంద్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను కొలీజియం ముందు ఉంచవచ్చు. వివరణలు కోరవచ్చు. అయితే కొలీజియం మళ్లీ ఆ పేర్లను ప్రభుత్వానికి పంపితే మాత్రం ప్రభుత్వం వాటిని ఆమోదించక తప్పదు. న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో న్యాయమూర్తులను నియమిస్తారు.
కొలీజియం సమస్య ఏమిటి?
2021 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సర్వీసు నిబంధనలు) సవరణ బిల్లు 2021పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేరళ ఎంపీ జాన్ బ్రిటాస్ న్యాయవ్యవస్థలోని లోపాల గురించి బహిరంగంగా మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకం, న్యాయవ్యవస్థలో వంశపారంపర్యం, కొలీజియం ప్రతిపాదనలపై ప్రభుత్వ మౌనం, న్యాయవ్యవస్థలో వైవిధ్యం లేకపోవడం వంటి అంశాలను రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్ లేవనెత్తారు. 1980 వరకు దేశ సుప్రీంకోర్టులో ఓబీసీ జడ్జిలు లేరని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. కొలీజియం వ్యవస్థలో నిర్ణయాలు ఎలా, ఎప్పుడు తీసుకుంటారనే దానిపై సిఫారసు ప్రభుత్వానికి చేరే ముందు ఎలాంటి సమాచారం బయటకు రాదన్నారు.
నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే ఏమిటి?
2014లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌ను తీసుకొచ్చింది కేంద్రం. ఇందులో కొలీజియం వ్యవస్థను తొలగించి న్యాయమూర్తులను నియమించేందుకు ఈ కమిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ఈ కమిషన్ నేరుగా పెంచుతుంది. వాస్తవానికి సీజేఐ నేతృత్వంలోని ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి, పౌర సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులను చేర్చుకునే వెసులుబాటు నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌లో ఉంది. ఇద్దరు నామినేటెడ్ సభ్యుల్లో ఒకరిని సీజేఐ, ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా నియమిస్తారు. అదే సమయంలో రెండో నామినేటెడ్ సభ్యుడు ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ మైనారిటీ కమ్యూనిటీ లేదా మహిళలు ఉంటారు. 2015లో సుప్రీంకోర్టు ఎన్‌జేఏసీ చట్టవిరుద్ధమని ప్రకటించింది.
కొలీజియం వ్యవస్థను రద్దు చేయవచ్చా?
కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పార్లమెంటు, లోక్ సభ, రాజ్యసభ ఉభయ సభల్లో జరిగే ఓటింగ్ లో కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండొంతుల ఎంపీల మెజారిటీ రావాలి. దీనితో పాటు ఈ సవరణకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల మద్దతు కూడా అవసరం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి ఇది సాధ్యం కాదని చెప్పవచ్చు.