Chandrayaan 3 Landing: అన్నింటిలా కాదు, చంద్రయాన్-3 చాలా స్పెషల్, అదే జరిగితే ల్యాండింగ్ వాయిదా!
Chandrayaan 3 Landing: మాడ్యూల్ స్థితి, చంద్రుడిపై పరిస్థితులు బట్టి ల్యాండింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నిలేష్ ఎం.దేశాయ్ అన్నారు.
Chandrayaan 3 Landing: జాబిల్లిపై అడుగుపెట్టడానికి చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ సిద్ధమైంది. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై అనువైన ప్రదేశంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ అన్వేషణ మొదలుపెట్టింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై విక్రమ్ కాలుమోపనుంది. చంద్రయాన్ విజయవంతం, విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకుతుందని నమ్మకం ఉందని ఇస్రో మాజీ చీఫ్ కె శివన్ తెలిపారు.
చంద్రయాన్ -2 సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నామని, చంద్రయాన్ -3 వాటన్నింటిని అధికమించి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చంద్రయాన్-2, చంద్రయాన్-3 రెండు మిషన్లు పూర్తిగా విభిన్నమైనవని అన్నారు. రెండు మిషన్లు వాటి సొంత వ్యవస్థ, సెన్సార్‌లను కలిగి ఉన్నాయన్నారు. చంద్రయాన్-3లో వ్యవస్థలు ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా పనిచేస్తున్నాయని, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండింగ్ అవుతుందన్నారు.
చంద్రునిపై విక్రం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎదురయ్యే సవాళ్లను శివన్ వివరించారు. 15 నిమిషాల వ్యవధిలో అంతరిక్ష నౌక వేగాన్ని సెకనుకు దాదాపు రెండు కిలోమీటర్ల నుంచి సున్నాకి తగ్గించడంలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. హార్డ్ ల్యాండింగ్‌ను నివారించడానికి వేగం తగ్గింపు చాలా కీలకమన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేలా చంద్రయాన్-3 మిషన్ రూపొందించినట్లు పేర్కొన్నారు.
చంద్రయాన్-2 సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలపై శివన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3లో లోపాలను సరిదిద్దినట్లు చెప్పారు. డిజైన్ మార్జిన్‌లు మెరుగుపరిచారని, మిషన్ విజయవంతం కావడానికి సిస్టమ్‌లో రిడెండెన్సీలు చేర్చినట్లు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల గొప్పదనాన్ని ఆయన మెచ్చుకున్నారు. నిరాశల నుంచి వేగంగా పుంజుకుని కొత్త మిషన్ ప్రారంభంచారని, మిషన్ డేటాను వేగంగా విశ్లేషించడం, సమస్యలను గుర్తించడంలో ఇస్రో సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండింగ్ సవాళ్లతో కూడుకున్నదని, కఠినమైన చంద్రుడి ఉపరితలం, రాతి ఉపరితలాలతో సహా ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా చంద్రయాన్-3 రోవర్ రూపొందించినట్లు చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో సంక్లిష్టతను వివరిస్తూనే, మనకు తెలియనివి చాలా ఉంటాయన్నారు. చంద్రయాన్-3 విజయవంతానికి ఇస్రో చేయాల్సిన ప్రతిదాన్ని చేస్తోందన్నారు. అయినా అంతరిక్షంలో ఎన్నో తెలియనివి ఉంటాయనిచ ఎదురుచూపులు, ఉత్కంఠత ఉంటాయన్నారు.
పరిస్థితులు అనుకూలించకపోతే 27కు ల్యాండింగ్ వాయిదా
విక్రం ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించి ఏవైనా ప్రతికూల అంశాలు తలెత్తితే చంద్రుడిపై ల్యాండింగ్‌ను ఆగస్టు 27కి మార్చనున్నట్లు అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నిలేష్ ఎం.దేశాయ్ వెల్లడించారు. మాడ్యూల్ స్థితి, చంద్రుడికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు బట్టి ల్యాండింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆగస్టు 23న చంద్రుడిపై ఉపరితలంపై ల్యాండర్ దిగే రెండు గంటల ముందు ఒకసారి పరిశీలిస్తామని, ల్యాండర్ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను ఒకసారి అంచనా వేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ ఆగస్టు 23న విక్రమ్ దిగేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆగస్టు 27కు దాన్ని మారుస్తామన్నారు. అయితే ఎలాంటి సమస్య లేకుండా ముందు అనుకున్నట్లు ఆగస్టు 23నే చంద్రుడిపై ల్యాండర్‌ను దించుతామని, సాధ్యం కాని పరిస్థితుల్లో 27కు మార్చే అవకాశం ఉందన్నారు.
Also Read: చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్-3 ల్యాండర్ అనుసంధానం -'Welcome Buddy' అంటూ సందేశం
Also Read: అత్యంత రహస్యంగా చంద్రుడి దక్షిణ ధృవం, అక్కడ ఎలా ఉంటుందంటే!