Timeline Order: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదు.. సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదిక
శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తే రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. అసమతుల్యతకు దారితీస్తుందని పేర్కొంది.

Supreme Courts Timeline Order To President and Governors | న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తే రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అలా చేయడం ద్వారా ప్రభుత్వ అంగాలకు తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని అందిపుచ్చుకొని పెత్తనం చెలాయించే అవకాశం ఉందని హెచ్చరించింది. రాజ్యాంగపరమైన సమస్యలు వస్తాయని, సున్నితమైన అధికార విభజనలో అసమతుల్యతకు దారితీస్తుందని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించింది.
అధికారాలను కబళిస్తే రాజ్యాంగ పరమైన గందరగోళం..
‘రాజ్యవ్యవస్థలోని ఒక అంగం వైఫల్యం, లేదా తప్పిదాన్ని సాకుగా చూపి మరో అంగం రాజ్యాంగం తనకు ఇవ్వని అధికారాన్ని చెలాయించడం సాధ్యం కాదు. ప్రజా ప్రయోజనం పేరుతోనో, రాజ్యాంగ విలువల పేరుతోనో మన రాజ్య వ్యవస్థలోని ఒక అంగం మరో అంగానికి సంబంధించిన అధికారాలను కబళిస్తే అది రాజ్యాంగ పరమైన గందరగోళానికి దారితీస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు అలాంటి పరిస్థితిని ఊహించలేదు’ అని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది.
విన్నవించిన సొలిసిటర్ జనరల్
శాసనసభ నివేదించిన బిల్లుల్ని గవర్నర్ పాస్ చేయడం లేదని, తొక్కి పెడుతున్నారంటూ తమిళనాడు గవర్నమెంట్ దాఖలు చేసిన వ్యాజ్యానికి స్పందించిన సుప్రీంకోర్టు.. గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించింది. సుప్రీంకోర్టు
తీర్పును కేంద్ర ప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కోర్టుకు విన్నవించారు. రాజ్యాంగం ఏర్పాటుచేసిన సమతుల్యతకు, చట్టపాలనకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు.
రాజ్యాంగ, శాసన వ్యవస్థలను రివర్స్ చేసినట్టు అవుతుంది..
‘ఒక వ్యవస్థలో లోపాలేవైనా ఉన్నట్టు భావిస్తే రాజ్యాంగం అనుమతించిన యంత్రాంగం సాయంతో వాటిని పరిష్కరించాలి. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల జవాబుదారీతనం, కార్యనిర్వాహక వర్గ బాధ్యతల నిర్వహణ, పై స్థాయి వ్యవస్థకు సమస్యల నివేదన, ప్రజాస్వామ్య విభాగాల మధ్య సంప్రదింపులు వంటివి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే యంత్రాంగాలు. రాజ్యాంగంలోని 142వ అధికరణం తన ముందున్న అంశానికి సంబంధించి పరిపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టుకు అధికారం ఇస్తోంది. అయితే ఆ అధికరణం(గవర్నర్) సమ్మతిని సృష్టించే అధికారాన్ని కోర్టుకు ఇవ్వడం లేదు. కోర్టులు సమ్మతిని సృష్టిస్తే అది రాజ్యాంగ, శాసన వ్యవస్థలను రివర్స్ చేసినట్టు అవుతుంది’ అని నివేదనలో సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు.
ప్రతి విషయంలోనూ న్యాయస్థానాల జోక్యం తప్పనిసరి కాదు
‘రాష్ట్రపతి, గవర్నర్లు రాజకీయంగా అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నారు. ప్రజాస్వామ్య పరిపాలనలో అత్యున్నత విలువలకు వారు ప్రతినిధులు. వారికి సంబంధించినంతవరకూ ఏమైనా లోపాలుంటే వాటిని రాజకీయ, రాజ్యాంగ పరమైన యంత్రాంగాల సాయంతో పరిష్కరించుకోవాలి. ప్రతి విషయంలోనూ న్యాయస్థానాల జోక్యం తప్పనిసరి కాదు. సమస్యలేవైనా ఉన్నాయని భావిస్తే వాటిని రాజకీయంగా పరిష్కరించాలే తప్ప, తప్పనిసరిగా న్యాయస్థానం సాయంతో మాత్రమే పరిష్కరించాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని సవరించడమే అవుతుంది
శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్కు నివేదించే 200వ రాజ్యాంగ అధికరణం, బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేయడాన్ని నిర్దేశించే 201 రాజ్యాంగ అధికరణం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేదని గుర్తుచేశారు. ఏదైనా నిర్ణయం తీసుకోడానికి నిర్దిష్ట గడువు ఉండాలని రాజ్యాంగం భావించినప్పుడు రాజ్యాంగం స్పష్టంగా ఆ గడువు ఎంత అన్నది పేర్కొంటుందని అన్నారు. లేని గడువును విధించడం రాజ్యాంగాన్ని సవరించడమే అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ఉన్న అధికారాలు చొరబాటుకు వీల్లేనివని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తెలిపారు.
14 ప్రశ్నలు వేసిన రాష్రపతి
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 10 బిల్లుల్ని తొక్కి పెట్టిన ఉదంతంపై దాఖలైన వ్యాజ్యానికి సుప్రీంకోర్టు స్పందించింది. ఆ బిల్లులపై నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని తీర్పు వెలువరించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంలోని 200వ, 201వ అధికరణాల కింద రాష్ట్రపతి, గవర్నర్లకు ఉన్న అధికారాలకు సంబంధించిన 14 ప్రశ్నల్ని సంధించారు. గవర్నర్లకు, రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా అని న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరారు.





















