Kartavyapath: కర్తవ్యపథ్ గా మారున్న రాజ్‌పథ్, కేంద్రం కీలక నిర్ణయం - ఈ 8న సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం
Kartavyapath: దిల్లీలోని రాజ్ పథ్ పేరు మారనుంది. రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చాలని కేంద్రంలోని మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Kartavyapath: సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన అన్ని సౌకర్యాలతో శోభాయమానంగా, కొత్త హంగులతో రూపుదిద్దుకున్న సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సెంట్రల్ విస్టా ఫోటోలను తాజాగా విడుదల చేశారు. రాజ్ పథ్ మార్గంలో కొత్త అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇన్ని రోజులు రాజ్ పథ్ మార్గంగా పిలుచుకోగా.. ఇక నుండి ఆ రోడ్డును కర్తవ్యపథ్ గా పేరు మార్చనుంది కేంద్రంలోని మోదీ సర్కారు.
కొత్త మార్గం శోభాయమానం..
సెంట్రల్ విస్టా మార్గాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ విస్టా అవెన్యూ సుమారు రెండు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు శోభాయమానంగా తయారు చేశారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా జోన్లు ఏర్పాటు చేశారు. లాన్స్ వద్ద కెనాల్స్ పై 16 చిన్న చిన్న బ్రిడ్జ్ లను నిర్మించారు. రద్దీగా ఉండే జంక్షన్లలో పాదచారుల కోసం అండర్ పాస్ లను నిర్మించారు. సెంట్రల్ విస్టా అవెన్యూలో 900 లకు పైగా లైట్ పోల్స్ పెట్టారు. బైకులు, కార్లు, క్యాబ్స్, ఆటోలు, బస్సుల కోసం వేర్వేరుగా పార్కింగ్ బేలు ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రజల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు.
సువిశాల పార్లమెంటు హాలు..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా మొత్తం 64 వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలే ట్రయాంగిల్ లో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం కంటే ఇది చాలా పెద్దగా ఉండనుంది. ఇందులో లోక్ సభ సుమారు 888 సీట్లు, రాజ్యసభ 384 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉభయ సభల్లో ఏక కాలంలో 1224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుంది. ప్రస్తుతం లోక్ సభలో 545 సీట్లు, రాజ్యసభలో 245 సీట్లే ఉన్నప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విశాలంగా నిర్మిస్తున్నారు.
కొత్త పార్లమెంటు భవనంలో భారత దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించే భారీ కానిస్టిట్యూషన్ హాల్ ఉంటుంది. రాజ్యాంగానికి సంబంధించిన ఒరిజినల్ కాపీని ఇక్కడ ప్రదర్శిస్తారు. భారతీయ వారసత్వాన్ని చాటి చెప్పేలా డిజిటల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేస్తారు.
భారీ జాతీయ చిహ్నం ఆవిష్కరణ
పార్లమెంటు నూతన భవనంపై ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీని రూపురేఖలపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ కొత్త విగ్రహాం.. సారనాథ్ స్థూపంలోని రూపం కంటే విభిన్నంగా ఉందని ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేశారు. సారనాథ్ స్థూపంలోని సింహాలు ఆకర్షణీయంగా, గంభీర వదనాన్ని కలిగి ఉండగా.. మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని సింహాలు రౌద్రంగా, కోరలు చాచి క్రూరంగా కనిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.