Cigarette Lighter Policy: సిగరెట్ లైటర్లను నిషేధించిన కేంద్రం, కారణం ఏంటంటే!
Cigarette Lighter Policy: రూ.20లు, అంతకంటే కంటే తక్కువ విలువ ఉన్న సిగరెట్ లైటర్లను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Cigarette Lighter Policy: రూ.20 లేక అంతకంటే తక్కువ విలువ ఉన్న సిగరెట్ లైటర్ల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విదించింది. అయితే CIF (ఖర్చు, బీమా, సరుకు) ఖర్చు లైటర్ కు రూ. 20 కంటే ఎక్కువ ఉంటే దిగుమతి చేసుకోవచ్చని, వాటిపై ఎలాంటి నిషేధం లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ లో పేర్కొంది. దాదాపు ఐదున్నర కోట్ల విలువైన పాకెట్ లైటర్లు, ఫ్యూయెల్డ్ గ్యాస్, రీఫిల్ చేసుకునే వీలున్న వాటిని 2022-23 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు కోటిన్నర రూపాయలకు పైగా దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.20లు, అంత కంటే తక్కువ ఉన్న సిగరెట్ లైటర్లపై నిషేధం విధించడానికి కారణం ఏంటో తెలుసా?
లైటర్లను నిషేధించాలని స్టాలిన్ విజ్ఞప్తి
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ప్రధాన ఉపాధి వనరుగా ఉన్నా అగ్గిపెట్టే పరిశ్రమను కాపాడేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిగరెట్ లైటర్లను నిషేధించాలని గత ఏడాది సెప్టెంబరులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అగ్గిపెట్టే తయారీతో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులను కాపాడుకునేందుకు కేంద్రం ఈ నిషేధం విధించాలని స్టాలిన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ అగ్గిపెట్టేల తయారీలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలిపారు.
Also Read: Aspartame: WHO చెప్పిన అస్పర్టమే అంటే ఏంటి? దీంతో క్యాన్సర్ వస్తుందా? ఈ ఉత్పత్తుల్లోనే ఎక్కువ!
వ్యవసాయానికి శుష్కంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటైన ఈ అగ్గిపెట్టే తయారీ రంగం ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంజిన్ గా సీఎం స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. అగ్గిపెట్టె పరిశ్రమ ఎగుమతుల ద్వారా సుమారు రూ.400 కోట్ల విదేశీ మారకపు ఆదాయాన్ని ఆర్జిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రికి రాసిన లేఖలో సీఎం గుర్తు చేశారు. కేంద్రం తాజాగా రూ.20లు, అంతకంటే తక్కువ విలువ ఉన్న సిగరెట్ లైటర్లపై నిషేధం వెలువడగానే.. ముఖ్యమంత్రి స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులోని అగ్గిపెట్టె పరిశ్రమలో లక్ష మందికి పైగా ప్రజలు జీవనోపాధిని పొందుతున్నారని, ఈ నిర్ణయంతో వారి ఉపాధికి రక్షణ లభించినట్లు పేర్కొన్నారు.
చైనీస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిగరెట్ లైటర్ల కారణంగా దేశీయ మార్కెట్ కూడా క్షీణిస్తోందని సీఎం స్టాలిన్ తెలిపారు. రూ. 10లకు లభించి సిగరెట్ లైటర్లు.. 20 అగ్గిపెట్టెలను భర్తీ చేస్తాయని అన్నారు. అలాగే ఈ నాన్ రిఫిల్లెబుల్ లైటర్లు అపారమైన ప్లాస్టిక్ వ్యర్థాలకు దారితీస్తాయని.. వాటి వల్ల పర్యావరణంగా, ఆరోగ్యంగా ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు.
I thank Hon'ble @PiyushGoyal for heeding our concerns and taking action to prohibit the import of pocket cigarette lighters, as requested in my letter last year. This decision is a significant step towards protecting the livelihoods of over a lakh people in Tamil Nadu's matchbox… pic.twitter.com/EDrM2bfqb0
— M.K.Stalin (@mkstalin) June 29, 2023
Join Us on Telegram: https://t.me/abpdesamofficial