ఉల్లి ధర కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం- మార్చి 31 వరకు అమలు
కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Onion Exports Ban:కేంద్రం ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతుల (Onion Exports)పై నిషేధం విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉల్లి ధరలు (Onion Prices) క్రమంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 నుంచి 60 రూపాయలు పైనే పలుకుతోంది. దీంతో వీటి ధరల కట్టడికి కోసం 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దేశంలో ఉల్లిపాయలను అందుబాటులో ఉంచడం, ధరలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎగుమతులపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. అయితే కొన్ని మినహాయింపులు కల్పించింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వెల్లడించింది. అయితే, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే, ఎగుమతి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
కనీస ఎగుమతి ధర 800 డాలర్లు
దేశీయ మార్కెట్లలో ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఇటీవల కేంద్రం పలుమార్లు ఎగుమతుల పాలసీని సవరించింది. ఈ ఏడాది ఆగస్టులో ఉల్లి ఎగుమతులపై 40శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. ఆ తర్వాత అక్టోబరులో దాన్ని సవరించింది. ఉల్లికి కనీస ఎగుమతి ధరను (MEP) 800 డాలర్లుగా నిర్ణయించింది. తాజాగా ఎగుమతులపై నిషేధం అమల్లోకి తెచ్చింది. MEP అనేది చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు అడ్డుకునేందుకు నిర్ణయించే ధర. ఈ ధర వల్ల ప్రపంచ కొనుగోలుదారులకు విక్రయించలేరు. ఫలితంగా దేశీయంగా ఉల్లిపాయల లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉల్లి ధరలు రెండింతలయ్యాయి. ఢిల్లీలో ఒక వారం క్రితం రూ. 25-30 మధ్య ఉన్న రేట్లు ఇప్పుడు రూ. 50-60కి చేరింది. బఫర్ స్టాక్ ద్వారా అదనంగా 2,00,000 టన్నుల ఉల్లిపాయలను సేకరిస్తామని శనివారం ప్రభుత్వం తెలిపింది. దీని కోసం ఇప్పటికే 5 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. ధరలు అధికంగా ఉన్న 16 నగరాల్లో ప్రభుత్వం ఉల్లిపాయల్ని విక్రయిస్తుందని అధికారులు తెలిపారు. పండగ సీజన్ లో సరఫరా తక్కువగా ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రతికూల పరిస్థితులతో తగ్గిన దిగుబడి
దేశంలో ఉల్లిపాయల సగటు రిటైల్ ధర 57 శాతం పెరిగి కిలోకు 50 రూపాయలకు చేరింది. దీంతో రిటైల్ మార్కెట్‌లలో బఫర్ ఉల్లిపాయల విక్రయాన్ని సబ్సిడీపై కిలోకు 25 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. గతేడాది ఇదే సమయంలో కిలో ఉల్లి ధర రూ. 30గా ఉంది. ఈ ఏడాది ప్రతీకూల వాతావరణ పరిస్థితులతో ఖరీఫ్ లో ఉల్లి నాట్లు ఆలస్యం కావడంతో పంట రాక ఆలస్యం అయింది. దీంతో ధరల పెరుగుదలకు దారి తీసింది.