BJP News: నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు- సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మోడీకే మళ్లీ పట్టం!
వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని ఢిల్లీ పీఠంపై సగర్వంగా మూడోసారి వికసించాలని భావిస్తున్న కమలం పార్టీ నేతలు.. నేటి నుంచి రెండు రోజుల పాటు కీలకమైన సమావేశాలునిర్వహిస్తున్నారు.
BJP News: భారతీయ జనతా పార్టీ(BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి(శనివారం) నుంచి రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీ(Delhi) కేంద్రంగా జరగనున్నాయి. భారత మండపం(Bharata Mandapam) వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటీ ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సమావేశాల ప్రధాన అజెండా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) విజయమే. అంతేకాదు.. ప్రస్తుతం ప్రధానమంత్రి(PM) నరేంద్ర మోడీ(Narendra modi)ని మరోసారి ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు. శనివారం ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు. అనంతరం.. జాతీయ కార్యవర్గ సమావేశ ప్రదేశంలో బీజేపీ జెండాను జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆవిష్కరించనున్నారు.
విస్తృత చర్చలు..
శనివారం మధ్యాహ్నం నుంచి భారత మండపంలో జరగనున్న బీజేపీ(BJP) విసృత్త జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పేరుకు తగిన విధంగానే అన్ని కోణాల వైపు నుంచినాయకులతో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. ఈ రోజు సహా ఆదివారం సాయంత్రం వరకూ ఈ సమావేశాలు నిర్విరామంగా జరుగుతాయని బీజేపీ(BJP) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, రెండో రోజైన ఆదివారం జాతీయ కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.
మరోసారీ మోడీనే..
2014లో అంతకు ముందు వరకు గుజరాత్(Gujarath) ముఖ్యమంత్రి(Chief minister)గా ఉన్న నరేంద్ర మోడీ(Narendra modi)ని తొలిసారి.. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ఏపీకి చెందిన నాయకుడు, పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు(Muppavarapu Venkaiah Naidu) బలపరిచారు. విధిలేని పరిస్థితిలో(విశ్లేషకుల మాట) అప్పటి కీలక నాయకుడు.. లాల్ కృష్ణ అద్వానీ కూడా మోడీకే జై కొట్టారు. ఇక, అప్పటి నుంచి నరేంద్ర మోడీ వరుసగా రెండు సార్లు ప్రధాని పీఠం అధిరోహించారు. అయితే.. ఆయన చరిష్మాతోనే ఇప్పుడు కూడా ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ.. ఈ దఫా.. అంటే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మరోసారి మోడీనే ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించనుంది. పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా కూడా ఆయన పేరునే నేతలు ఏకగ్రీవంగా ఆమోదించనున్నట్టు పార్టీ తెలిపింది.
సిద్ధాంతాలను పక్కన పెట్టారా?
మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)ని ప్రధాని పదవికి ఎంపిక చేయడంపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలకు ఎలా ఉన్నప్పటికీ.. కీలకమైన ఆర్ ఎస్ ఎస్(RSS)లో మోడీ పేరుపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. 70 ఏళ్లు దాటిన నాయకులకు పార్టీలో పదవులు ఇవ్వొచ్చు కానీ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవులు ఇవ్వరాదని గతంలోనే తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్పను 70 ఏళ్ల వయసు రాగానే పక్కకు తప్పించారనే వాదన ఉంది. అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందీబెన్ పటేల్‌ను కూడా గత ఎన్నికల్లో పక్కన పెట్టారు. ఈమె ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె వయసు కూడా.. 70 + కావడం గమనార్హం. మరి ప్రస్తుతం 73 ఏళ్ల వయసు ఉన్న నరేంద్ర మోడీకి మరోసారి ప్రధానిగా అవకాశం ఇస్తుండడం పట్ల ఆర్ ఎస్ ఎస్ నేతల మధ్య చర్చ సాగుతోంది. అయితే.. మోడీని మించిన చరిష్మా ఉన్న నాయకడుఉ బీజేపీలో ఏలకపోవడంతోనే ఇలా చేస్తున్నారన్న వాదన కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మోడీ తప్ప.. బీజేపీకి ప్రత్యామ్నాయం లేకుండా పోయిందనే వాదన కూడా ఉంది. ఇదిలావుంటే.. కాంగ్రెస్ వంటి పార్టీలను ఇప్పుడు ఎదుర్కొంటే.. ఇక తిరుగు ఉండదని కూడా భావిస్తుండడం దీనికి మరో కారణంగా కనిపిస్తోంది.
నడ్డాకు పదవీ కాలం..
ప్రస్తుతం బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జగత్ ప్రకాష్ నడ్డా(JP Nadda) పదవీ కాలం కూడా.. ఈ నెలతో పూర్తి అయిపోయింది. అయినప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ జాతీయ కౌన్సిల్‌లో తీర్మానం జరిగింది. రెండు రోజుల కీలక సమావేశాల నేపథ్యంలో భారత మండపంలో పదేళ్ళ ప్రగతి ప్రస్థానాన్ని తెలుపుతూ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను పార్టీ ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 300 మందికిపైగా బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకున్నారు.
ఇవీ.. ప్రధాన చర్చనీయాంశాలు
+ మూడోసారి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎంపిక
+ ఎన్డీయే కూటమిని బలపరిచే క్రమంలో ఇతర పార్టీలతో పొత్తు
+ పొత్తుల కారణంగా బీజేపీకి ఒనగూరే లబ్ధి
+ మోడీ ప్రభావం
+ బీజేపీ వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలు
+ ఈ సమావేశాల్లోనే స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసి ప్రకటించడం.