Bihar CM Attacked Video : బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై యువకుడు దాడి, వీడియో వైరల్
Bihar CM Attacked Video : బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది దాటుకుని వచ్చిన వ్యక్తి సీఎం వీపుపై బలంగా కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Bihar CM Attacked Video : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) పై ఓ యువకుడు దాడి చేశాడు. నితీశ్ కుమార్ ఆదివారం తన స్వగ్రామం భకిత్యాపూర్‌లో పర్యటించారు. సీఎం నితీశ్ కుమార్ గ్రామంలోని ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు యువకుడు వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. భకిత్యాపూర్ లోని స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో షిల్‌భద్ర యాజీ అనే స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సీఎం నితీశ్ ఆవిష్కరించడానికి అక్కడికి వచ్చారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నప్పుడు ఓ యువకుడు వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ స్టేజ్‌పైకి వచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటుకుని వచ్చిన యువకుడు సీఎం వీపుపై బలంగా కొట్టాడు. మరోసారి కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని స్థానికులు అంటున్నారు. భద్రతా సిబ్బంది ఉండగా ఓ వ్యక్తి ఇలా దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తుందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.
Bihar | A youth tried to attack CM Nitish Kumar during a program in Bakhtiarpur. The accused was later detained by the Police.
— ANI (@ANI) March 27, 2022
(Viral video) pic.twitter.com/FoTMR3Xq8o
గతంలోనూ దాడి
ఇది మొదటి ఘటన కాదు. బిహార్ సీఎంపై గతంలో కూడా దాడి జరిగింది. నవంబర్ 2020లో మధుబని జిల్లాలోని హర్లాఖిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు నితీష్ కుమార్ పై ఉల్లిపాయలు విసిరారు. ఉల్లిపాయలు విసరడంతో మొదట అవాక్కైన నితీశ్ తర్వాత లైట్ తీసుకుని "ఖూబ్ ఫెంకో-ఖూబ్ ఫెంకో" (మరికొన్ని విసరండి) అని హాస్యాస్పదంగా అన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది నితీశ్ చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. దీంతో నిందితుడు ఎవరైనా వదిలేయమని అతని గురించి పట్టించుకోవద్దని భద్రతా సిబ్బందికి సూచించారు.
నితీశ్ కుమార్ అసంతృప్తి
బిహార్ లో బీజేపీ-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోన్న సీఎం నితీశ్ కుమార్ ఆ మధ్య బీజేపీ నుంచి విడిపోడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మనసు మార్చుకుని కమలనాథులతోనే ఉన్నారు. పార్టీ గత తీర్మానాలకు భిన్నంగా బీహారేతర రాష్ట్రాల్లోనూ బీజేపీకి మద్దతు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ పై సీఎం నితీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బిహార్ లో జేడీయా, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీకి అధిక సీట్లు వచ్చినా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కే సీఎం పదవి దక్కింది. కానీ ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు బీజేపీ నేతలకే దక్కాయి. దీంతో నితీశ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.