Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటపై స్పందించిన భోలేబాబా, ప్రమాదానికి కారణం నిర్వాహకులేని స్టేట్మెంట్
Hathras Stampede Bhole Baba: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పై భోలే బాబా తొలిసారి స్పందించారు.
Hathras Stampede Telugu News: హత్రాస్ సత్సంగం తొక్కిసలాట ఘటనపై తొలిసారిగా భోలేబాబా అలియాస్ సాకర్ హరిబాబా స్పందించారు. మరణించిన వారికి బాబా సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో పాటు తొక్కిసలాట జరగక ముందే అక్కడ నుంచి తాను వెళ్లిపోయానని స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణం నిర్వాహకులేనని ఆరోపించారు. హత్రాస్‌లో జరిగిన సంఘటన తర్వాత భోలే బాబా మంగళవారం అర్ధరాత్రి మైన్‌పురిలోని బిచ్వాన్ పట్టణంలోని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 121 మంది చనపోయారు. వందలాది మంది గాయపడ్డారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏపీ సింగ్‌ను తన లాయర్‌గా అధికారికంగా నియమించుకున్నట్లు బాబా లిఖితపూర్వకంగా ప్రకటన కూడా విడుదల చేశారు.
ఎక్స్ గ్రేషియా ప్రకటన
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ తొక్కిసలాట ఘటనను 'రాజకీయం' చేస్తున్నందుకు ప్రతిపక్ష నాయకులను విమర్శించారు. ఈ విషాద ఘటనలో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం యోగి.. ఇలాంటి బాధాకరమైన ఘటనలను రాజకీయం చేయాలనే ధోరణిని మార్చుకోవాలన్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిహారం ప్రకటించారు. సమావేశ నిర్వాహకులు సంఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ సంఘటనపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దోషులను వదిలిపెట్టేది లేదని సీఎం చెప్పారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు
ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో భోలే బాబా పేరు నమోదు కాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. బాబా సహాయకులు, ఈవెంట్ నిర్వాహకుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో నమోదయ్యాయి. భోలే బాబాను అరెస్ట్ చేస్తారనే ప్రశ్నకు రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ కుమార్ వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. తొక్కిసలాట జరిగిన హత్రాస్‌లోని సంఘటన స్థలంలో ఫోరెన్సిక్ బృందం తన పనుల్లో నిమగ్నమై ఉంది. హత్రాస్ నుండి బిజెపి ఎంపి, అనూప్ ప్రధాన్ కూడా జిల్లా ఆసుపత్రిలో బాధితులను కలిశారు.
భోలే బాబా పై కేసులు
బోలే బాబా పై కొంతమంది న్యాయవాదులు కేసులు పెట్టారు. బాబాకు చెందిన అన్ని ఆశ్రమాలు, భూములపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. యూపీలోని ఆగ్రాలో గురువారం జరగాల్సిన భోలే బాబా మరో ‘సత్సంగం’ రద్దైంది. కేవలం 80 వేల సామర్థ్యం కలిగిన ప్రాంతంలోకి 2.5 లక్షల మంది గుమిగూడినా.. సాక్ష్యాల్ని దాచి పెట్టారని ఆరోపిస్తూ నిర్వాహకులపై పోలీసులు కేసులు పెట్టారు.