Beti Bachao Beti Padhao : పథకం ఒకటే లక్ష్యాలు మాత్రం ఆరు- పదేళ్ల లోపు ఉన్న ప్రతి ఆడపిల్లా దీనికి అర్హులే
Beti Bachao Beti Padhao: బాలికల సంక్షేమం, చదువుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకమే బేటీ బచావో.. బేటీ పడావో. 2015లో హర్యానాలోని రూ.100 కోట్ల నిధితో ప్రారంభించారు.
Beti Bachao Beti Padhao: బాలికల సంక్షేమం, చదువుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకమే బేటీ బచావో.. బేటీ పడావో. దీని అర్థం ఆడ పిల్లను రక్షించండి.. ఆడపిల్లలకు చదువు చెప్పండి. ఈ పథకాన్ని 2015లో హర్యానాలోని పానిపట్‌లో రూ.100 కోట్ల నిధితో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మినిస్ర్టీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భ్రూణ హత్యల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పథకం ప్రధాన ఉద్ధేశం దేశంలో తగ్గిపోతున్న బాలికల సంఖ్యను పెంచడం ద్వారా లింగ నిష్పత్తిని మెరుగ్గా ఉంచడమే. ఈ పథకానికి 2016 ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్రం నియమించింది.
లింగ నిష్పత్తిని తగ్గించడమే లక్ష్యం
బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం ద్వారా అనేక రాష్ట్రాల్లో తగ్గుతున్న లింగ నిష్పత్తిని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. ప్రధానంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆడ శిశువుల పట్ల వివక్ష పెరిగి అబార్షన్లు చేస్తున్నారు. 1991 జాతీయ గణన ఫలితాలు విడుదలైనప్పుడు ఈ ధోరణి మొదటిసారిగా గుర్తించారు. 2001 జాతీయ జనాభా గణన ఫలితాలు విడుదలైనప్పుడు ఇది మరింత తీవ్రమవుతున్న సమస్యగా నిర్ధారించారు. 2011 జాతీయ జనాభా లెక్కల ఫలితాలు ప్రకారం దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్ర్తీ జనాభా మరింత దిగజారుతున్నట్టు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో బేటీ బచావో.. బేటీ ఫడావో కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా సేవ్ గర్ల్ చైల్డ్, టు ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్ నినాదాలను తీసుకువచ్చింది. ఈ ప్రోగ్రామ్‌కు జాతీయ కన్వీనర్‌గా డాక్టర్ రాజేంద్ర ఫడ్కేను కేంద్రం నియమించింది.
మూడు లక్ష్యాలతో ఏర్పాటు
బేటీ బచావో.. బేటీ ఫడావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు లక్ష్యాలతో ఏర్పాటు చేసింది. బాలకల విద్య, భాగస్వామ్యాన్ని పెంచడం. అమ్మాయిల కొనుగోలు, భ్రూణ హత్యలను నివారించడం, ఆడ పిల్లల మనుగడ, భద్రతను నిర్ధారించడమే లక్ష్యంగా దీన్ని అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయా శాఖల సమన్వయంతో ఈ మూడు లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం దిశా, నిర్ధేశం చేసింది. ఇందుకోసం ఒక్కో జిల్లాకు కేంద్రం రూ.26 లక్షల రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తంతో బాలికలు, మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇవీ ప్రయోజనాలు
ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బాలికల చదువులకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ పథకంతో బాలికలు ఎక్కువ అధ్యయనం చేయడం ద్వారా స్వయం సమృద్ధి సాధించగలుగుతారు. ఈ పథకంతో బాలికలు సరైన వయసులో వివాహం చేసుకుంటారు. ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖతోపాటు ఇతర ప్రభుత్వశాఖలు కలిసికట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ఈ పథకంలో భాగంగా గర్భిణీలకు స్కానింగ్ చేయకుండా ఆరోగ్యశాఖ చూస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ సెంటర్ల మానిటరింగ్, పరీక్షలు చేయకుండా పకడ్బందీ చర్యలను ఈ శాఖ తీసుకుంటుంది. అదే సమయంలో చైల్డ్ మ్యారేజీలు జరగకుండా ఐసీడీఎస్ పర్యవేక్షిస్తుంది. చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయకుండా చూడడంతోపాటు అలా చేసిన వారిపై కఠినంగా వ్యవహరించడం, అవసరమైతే బాలికలను ప్రత్యామ్నాయ చోట్లకు తరలించి చదువుకునేలా చేసే బాధ్యతను ఈ శాఖకు అప్పగించింది. ఉన్నత విద్య చదువుకునేందుకు అవసరమైన సహకారాన్ని విద్యాశాఖ అందిస్తుంది. గ్రామ స్థాయిలో బాలురు, బాలికల నిష్పత్తిని తెలియజేసేలా బోర్డులు ప్రదర్శించడం, బాలికల పట్ల వివక్ష లేకుండా చూడడం, ప్రజల్లో ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ పథకంలో భాగంగా చేయనున్నారు. నేరుగా ఎటువంటి ఆర్థిక లబ్ధి ఈ పథకంలో భాగంగా చేయరు.