Ayodhya Ram Mandir: రామమందిర నిర్మాణం.. 20- 25 కోట్లు పెరగనున్న యూపీ ఆదాయం
Ram Mandir Consecration: రామమందిర నిర్మాణం.. ఎన్నో ఏళ్ల కల. అది ఇప్పుడు సాకారం అయ్యింది. ఇక రామమందిర నిర్మాణంతో యూపీలో టూరిజం కూడా బూస్టప్ కానుంది.
Ram Mandir Consecration: ఉత్తరప్రదేశ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారమోగిపోతోంది. ప్రపంచంలోని చాలామంది ఇప్పుడు ఈ రాష్ట్రానికి రావాలని ఉవ్విళూరుతున్నారు. కారణం.. రామమందిరం. అయోధ్య రామమందిరాన్ని చూడాలని, రాములవారిని దర్శించుకోవాలని చాలామంది వేచిచూస్తున్నారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న బాలరాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం రానేవచ్చింది. దీంతో ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ ఆదాయం రెట్టింపు కానుంది. రామమందిరం కారణంగా.. పర్యాటకుల తాకిడి ఎక్కువ అవ్వడంతో యూపీ ఆదాయం దాదాపు 20 - 25వేల కోట్ల రూపాయలు పెరుగుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. ఈ మేరకు దానికి సంబంధించి రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎస్‌బీఐ.
రిపోర్ట్‌లో ఏముందంటే?
ఎస్‌బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. యూపీలో రామమందిరం, ఇతర పర్యాటక ప్రదేశాల ద్వారా దాదాపు 20 - 25 వేల కోట్ల పన్ను ఆదాయం పెరుగనుంది. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వ తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి డ్రైవ్ అంటే.. ప్రసాద్ పథకం ద్వారా ఉత్తరప్రదేశ్ చాలా ప్రయోజనం పొందుతున్నట్లు నివేదికలో చెప్పింది.
టూరిస్టులు రెట్టింపు..
యూపీలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గంగానది, వారణాసి, తాజ్‌మహల్ లాంటి ప్రదేశాలకు తరచూ టూరిస్టులు వస్తూ ఉంటారు. దీంతో యూపీకి పర్యాటకుల తాకిడికి కొదవలేదనే చెప్పాలి. అయితే, 2024 నుంచి అది ఇంకా రెట్టింపు అవుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. రామమందిరం కారణంగా టూరిస్టుల తాకిడి డబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పింది. 2022లో దేశీయ టూరిస్టులు 2.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. విదేశీ పర్యాటకులు దాదాపు 10 వేల కోట్లు యూపీలో ఖర్చు చేశారని, ఈ సంవత్సరం రాష్ట్రంలో పర్యాటక వ్యయం రూ.4 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ రామమందిరం ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థ కూడా మరింతగా మారనున్నట్లు ఎస్‌బీఐ రిపోర్ట్‌లో చెప్పింది. 2027-28 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 5 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని, ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లను దాటుతుందని ఆ రిపోర్ట్‌లో చెప్పింది.ఇది నార్వే వంటి దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే ఎక్కువగా ఉంటుంది.భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడటంతో యూపీ ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు నిపుణులు చెప్తున్నారు. మన దేశ జీడీపీకి దాదాపు 10 శాతం కంట్రిబ్యూషన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఊపందుకున్న బిజినెస్
యూపీలోని అయోధ్యలో బిజినెస్ గ్రోత్ ఇప్పటికే చాలా ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. రామమందిరం నిర్మాణం మొదలైనప్పటి నుంచి రియల్‌ఎస్టేట్ ఒక్కసారిగా భూమ్‌లోకి వచ్చిందని చెప్తున్నారు. భూముల ధరలకు రెక్కలొచ్చాయి, అయోధ్య పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కూడా. పర్యాటకుల రాకను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఇప్పటికే సన్నాహాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా టూరిజం, హాస్పిటాలిటీ రంగం భారీగా పెరిగిపోయింది. అధునాతన కట్టడాలు, హోటళ్లు, రిసార్ట్‌లు పెరిగిపోయాయి. టూరిస్టులు, భక్తులు ఉండేందుకు సౌకర్యాలను నిర్మిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే.. రామమందిరం నిర్మాణం పూర్తై, బాలరాముడిని జనవరి 22న ప్రతిష్ఠించనుండగా.. జనవరి 23 నుంచే.. రాములోరిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులను అనుమతించనున్నారు.