Election 2023 Live: మిజోరంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - ఛత్తీస్ గఢ్ లోనూ 10 స్థానాలకు ముగిసిన ఓటింగ్
Election 2023 Live: మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు చత్తీస్‌గడ్‌లో మొత్తం 90 స్థానాల్లో 20 స్థానాలకు తొలి దశలో పోలింగ్ ప్రారంభమైంది. దీని కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
LIVE
Background
Assembly Election 2023 Voting Live: మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తొలిదశలో ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ (నవంబర్ 7) పోలింగ్ ప్రారంభమైంది. మిజోరంలోని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని 20 సీట్లలో చాలా వరకు నక్సల్స్ ప్రభావిత బస్తర్ డివిజన్‌లోనే ఉన్నాయి. మొత్తం 20 సీట్లలో 12 స్థానాలు షెడ్యూల్డ్ తెగలకు, ఒకటి షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని 10 స్థానాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగిలిన స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిజోరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ కోసం 25,249 మంది సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తొలి విడతలో 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 40,78,681 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 19,93,937 మంది పురుషులు, 20,84,675 మంది మహిళలు, 69 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. మొదటి విడతలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్‌లోని 12 నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్ )కు చెందిన 40 వేల మంది సహా 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. రాజ్ నంద్ గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా అభ్యర్థులు ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక్కడ 29 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అత్యల్పంగా చిత్రకోట్, దంతెవాడ స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న 20 సీట్లలో 19 స్థానాలు కాంగ్రెస్ ఆధీనంలో ఉన్నాయి. ఉపఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకుంది.
8.57 లక్షల మంది ఓటర్లు మిజోరాంలో 174 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు. మిజోరంలోని మొత్తం 1,276 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మధుప్ వ్యాస్ తెలిపారు.
వీటిలో 149 పోలింగ్ కేంద్రాలు రిమోట్ ఏరియాలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎన్నికల దృష్ట్యా అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లోని 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా ప్రకటించారు. ఎన్నికల కోసం సుమారు 3 వేల మంది పోలీసులు, పెద్ద ఎత్తున సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్ ) బలగాలను మోహరించారు.
40మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మయన్మార్‌తో 510 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును, బంగ్లాదేశ్ తో 318 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అసోంలోని మూడు జిల్లాలు, మణిపూర్‌లోని రెండు జిల్లాలు, త్రిపురలోని ఒక జిల్లాతో కూడిన సరిహద్దులను మూసివేశారు.
అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం), కాంగ్రెస్ చెరో 40 మంది అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ 23, ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. వీరితోపాటు 27 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మిజోరంలో మొత్తం 8,57,063 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 4,39,026 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మిజోరంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - ఛత్తీస్ గఢ్ లోనూ 10 స్థానాలకు ముగిసిన ఓటింగ్
మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 3 గంటల వరకూ సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు 69 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు, ఛత్తీస్ గఢ్ లో 10 స్థానాలకు మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ పూర్తైంది.
ఛత్తీస్ గఢ్ లో మావోలు, భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు - ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు?
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఓటింగ్ కు అంతరాయం కలిగించేలా నక్సల్స్ ఎదురు కాల్పులకు దిగారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. అటు కంకేర్ జిల్లాలోని బండే పోలీస్ స్టేషన్ పరిధిలోనూ భద్రతా బలగాలు, మావోల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో పోలీసులు ఏకే 47 స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో సోదాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మిజోరంలో ఒంటి గంట వరకూ 52.73 శాతం పోలింగ్ - ఛత్తీస్ గఢ్ లో 60.37 శాతం ఓటింగ్
మిజోరంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 52.73 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 8.57 లక్షల మంది ఓటర్లుండగా, మొత్తం సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 60.37 శాతం ఓటింగ్ నమోదైంది. అటు, ఛత్తీస్ గఢ్ లోనూ స్వల్ప ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు భారీగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒంటి గంట వరకూ 44.55 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
బండా పోలింగ్ స్టేషన్ వద్ద నక్సల్స్ కాల్పులు - దీటుగా బదులిచ్చిన భద్రతా సిబ్బంది, ప్రశాంతంగా పోలింగ్
ఛత్తీస్ గఢ్ బండా పోలింగ్ స్టేషన్ సమీపంలో ఔటర్ కార్డన్ కోసం మోహరించిన DRG సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. పోలింగ్ స్టేషన్ కు 2 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు దీటుగా బదులిచ్చాయని, జవాన్లంతా క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఓటింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు చెప్పారు.
ఉదయం 11 వరకూ చత్తీస్ గఢ్ లో 22.97 శాతం, మిజోరంలో 27.14 శాతం పోలింగ్
ఉదయం 11 గంటల వరకూ చత్తీస్ గఢ్ లో 22.97 శాతం, మిజోరంలో 27.14 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు.