Supreme Court: పోలీసు ఎన్‌కౌంటర్లపై అస్సాం సర్కారుకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు
Supreme Court: అస్సాం పోలీసు ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
![Supreme Court: పోలీసు ఎన్‌కౌంటర్లపై అస్సాం సర్కారుకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు Assam Police Encounter Supreme Court Notice to Assam Govt On Plea Against Police Encounters In The State Supreme Court: పోలీసు ఎన్‌కౌంటర్లపై అస్సాం సర్కారుకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/17/cd01e732e12dc16842116befb091ec9d1689595079228754_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Supreme Court: అస్సాంలో 2021 మేలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసు ఎన్‌కౌంటర్లు పెరిగిపోయాయి. ఉత్తరప్రదేశ్ లో యోగి తరహాలోనే అస్సాంలో హిమంత బిస్వా శర్మ కూడా పాలన సాగిస్తున్నారని, నేరగాళ్లను ఏరివేసేందుకు పోలీసులు తుపాకులు ఎక్కుపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయవాది ఆరిఫ్ ఎండీ యెసిన్ జ్వాద్దర్ దాఖలు చేసిన అప్పీల్ పై న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్, అరవింద్ కుమార్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, ఇతరులకు నోటీసులు జారీ చేసింది.
అస్సాంకు ఎస్సీ నోటీసులు జారీ
2021 మే తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్ల ఘటనలపై మానవ సంఘాలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గౌహతి హైకోర్టులో గతంలో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. పోలీసు ఎన్ కౌంటర్లపై దాఖలైన పిల్ ను కొట్టేసింది. ఇప్పటికే ఒక్కో ఎన్‌కౌంటర్ కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నందున ప్రత్యేక విచారణ అవసరం లేదని పేర్కొంటూ జనవరి 27వ తేదీన గౌహతి హైకోర్టు పిల్ ను కొట్టివేసింది.
'అన్ని ఎన్‌కౌంటర్లలో పోలీసుల తీరు ఒకటే'
2021 మే లో హిమంత బిస్వా శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయం నుంచి అస్సాం రాష్ట్ర పోలీసులకు, వివిధ కేసుల్లో నిందితులకు మధ్య 80 కి పైగా నకిలీ ఎన్ కౌంటర్లు జరిగాయని, అందులో 28 మంది మరణించారని, అలాగే చాలా మంది గాయపడ్డారని జ్వాద్దర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నకిలీ ఎన్‌కౌంటర్లలో మరణించిన లేదా గాయపడిన వారేమీ భయంకరమైన నేరస్థులు కాదని పేర్కొన్నారు. అలాగే ఎన్‌కౌంటర్‌లలో పోలీసుల తీరు ఒకే విధంగా ఉన్న విషయాన్ని కూడా నొక్కి చెప్పారు. ఈ ఫేక్ ఎన్ కౌంటర్లపై సీబీఐ, సిట్ వంటి స్వతంత్ర ఏజెన్సీ లేదా కోర్టు పర్యవేక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసులతో విచారణ జరిపించాలని జ్వాద్దర్ కోరారు.
'ఆయుధాలు లాక్కోవడం పోలీసులు కాల్పులు జరపడం..'
వార్తా పత్రికల్లో ప్రచురితమైన పోలీసుల ప్రకటనల ప్రకారం, ప్రతి సంఘటనలోనూ నిందితులు పోలీసు సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపవలిసి వచ్చినట్లు చెప్పిన్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ లో చనిపోయినా, గాయపడిన వారేమీ మిలిటెంట్లు కాదని, వారికి ఆయుధాలు ఎలా వాడాలో కూడా తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. పోలీసులు చెబుతున్న ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసులో అస్సాం ప్రభుత్వంతో పాటు అస్సాం పోలీసు చీఫ్, రాష్ట్ర లా అండ్ జస్టిస్ డిపార్ట్‌మెంట్, జాతీయ మానవ హక్కుల కమిషన్, అస్సాం మానవ హక్కుల కమిషన్ లను ప్రతివాదులుగా చేర్చారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)