Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!
Assam Floods: అసోంలో కృత్రిమ వరదలు సృష్టించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Assam Floods: అసోం కాచార్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బరాక్ నది కట్టను తెంచి తద్వారా సిల్‌చార్ నగరంలో వరదలు వచ్చేలా చేసిన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిని మిథు హుస్సేన్ లస్కర్, కాబుల్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కాచార్ ఎస్పీ రమణ్‌దీప్ కౌర్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో వీరిద్దరి ప్రమేయం గురించి పూర్తి వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ఈ కేసుపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లస్కర్‌ను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు, కాబుల్ ఖాన్‌ను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
సీఎం వార్నింగ్
అసోంలో సంభవించిన వరదలు ప్రకృతి విపత్తు కాదని కృత్రిమమని అంతకుముందు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





















