Assam Floods: అస్సాంలో వరద బీభత్సం, సుమారు 5 లక్షల మందిపై తీవ్ర ప్రభావం
Assam Floods: అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వానలు కాస్త తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం తొలగిపోలేదు. సుమారు 5 లక్షల మంది ప్రభావితమయ్యారు.
Assam Floods: అస్సాం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది. సుమారు 5 లక్షల మందిపై ఈ వరదలు పెను ప్రభావాన్ని చూపాయి. బజలి జిల్లాలోనే దాదాపు 2.67 లక్షల మంది ప్రభావితమయ్యారు. ఆ తర్వాత నల్బరిలో 80,061 మంది, బార్ పేటలో 73,233 మంది, లఖింపూర్ లో 22,577 మంది, దర్రాంగ్ లో 14,583 మంది, తాముల్ పూర్‌లో 7,280 మంది ప్రభావితమైనట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకటించింది. గొల్ పరా జిల్లాలో వరదల కారణంగా 10,782.80 హెక్టార్లలో పంట నీటమునిగి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
ఆగమాగమైపోయిన ప్రజలు, పెంపుడు జంతువులు
బజలి, బక్సా, బార్ పేట, బిస్వనాథ్, బొంగైగావ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూగర్, గోల్పరా, గోలాఘట్, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, తాముల్ పూర్, ఉడాలి జిల్లాలోని 54 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1,538 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం జోర్హాట్ జిల్లాలోని నీమతిఘాట్ వద్ద, ధుబ్రి మానస్ నది, పగ్లాదియా నది, పుతిమరి నది వద్ద ప్రమాద స్థాయి మార్కును దాటి ప్రవహిస్తున్నాయి. అధికార యంత్రాంగం వరద ప్రభావిత జిల్లాల్లో 140 సహాయ శిబిరాలను, 756 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సహాయక శిబిరాల్లో 35,142 మంది ఆశ్రయం పొందుతున్నారు. చాలా మంది రోడ్లు, ఎత్తైన ప్రాంతాలు, కట్టలపై ఆశ్రయం పొందినట్లు అధికారులు తెలిపారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నివేదిక ప్రకారం 4,27,474 పెంపుడు జంతువులు కూడా వరదల వల్ల ప్రభావితమైనట్లు తెలుస్తోంది. వరదల ప్రవాహానికి గత 24 గంటల్లో ఓ గట్టు తెగిపోయింది. మరో 14 ఇతర కట్టలు, 213 రోడ్లు, 14 వంతెనలు, అనేక పాఠశాలలు, నీటిపారుదల కాల్వలు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
వరదల్లో కొట్టుకుపోయినన ఇళ్లు
బజలి జిల్లాలో వరద పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది. 191 గ్రామాలకు చెందిన 2,67,253 మంది ప్రజలు ప్రభావితం అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 368.30 హెక్టార్ల పంట పొలాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. డోలోయ్ గావ్ శాంతిపూర్ గ్రామ ప్రాంతంలోని దాదాపు 200 కుటుంబాలు పహుమారా నది వరదతో ప్రభావితం అయ్యాయి. గ్రామస్థులు గట్ల వెంట, రహదారులపై తాత్కాలిక గుడారాలు వేసుకుని ఆశ్రయం పొందుతున్నారు. గ్రామంలోని 8-10 ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయని వరద బాధితులు చెబుతున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Also Read: Assam Floods: అసోంను ముంచెత్తుతున్న వరదలు, జలదిగ్బంధంలో 20 జిల్లాలు- నీట మునిగిన 1.20 లక్షల మంది
ఇప్పటివరకు ఇద్దరు మృతి
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరుగుతున్నా.. ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇంత పెద్ద వరదలు వచ్చినా పెద్దగా ప్రాణ నష్టం జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలే కారణం. వరద బీభత్సంతో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వారికి పరిహారం ప్రకటించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial