(Source: ECI/ABP News/ABP Majha)
Assam Floods: అసోంను ముంచెత్తుతున్న వరదలు, జలదిగ్బంధంలో 20 జిల్లాలు- నీట మునిగిన 1.20 లక్షల మంది
Assam Floods: అసోం రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో 20 జిల్లాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Assam Floods: అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల ప్రభావం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ భారీ వరదలతో 1.20 లక్షల మందికిపైగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వానలతో రోడ్లు ఎక్కిడకక్కడ దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నదులు ఉగ్రరూపం దాల్చాయి. చాలా నదులు, కాల్వలు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. 20 జిల్లాల్లోని 1.20 లక్షల మందికి పైగా వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అసోం సహా భూటాన్ లో కుండపోత వర్షాలు
అసోం సహా పొరుగున ఉన్న భూటాన్ దేశంలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక నదులు ఉప్పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీని వల్ల బజలి, బక్సా, బర్పేట, బిశ్వనాథ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూఘర్, గోలాఘాట్, హోజాయ్, కమ్రూప్, కోక్రాఝఱ్, లఖింపూర్, నాగావ్, నల్బరి, సోనిత్ పూర్, ఉడల్ గురి, తముల్ పూర్ జిల్లాల్లోని 45 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న 780 గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి.
వరదల్లో చిక్కుకున్న పెంపుడు జంతువులు, కోళ్లు
నల్బరీ జిల్లాలో 44,708 మంది, లఖింపూర్ లో 25,096 మంది, బార్ పేట జిల్లాలో 3,840 మంది, బక్సాలో 26,571 మంది, తముల్ పూర్ లో 15,610 మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 1.07 లక్షల పెంపుడు జంతువులు, కోళ్లు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో బుధవారం నాలుగు కట్టలు, 72 రోడ్లు, 7 బ్రిడ్జీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
సురక్షిత ప్రాంతాలకు జనాల తరలింపు
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో 14 సహాయక శిబిరాలు, 17 సహాయ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ధుబ్రి, బక్సా, కోక్రాఝర్, తముల్పూర్, నల్పారి జిల్లాల్లోని సహాయ శిబిరాల్లో సుమారు 2,091 మంది ప్రజలు ఉన్నట్లు వెల్లడించారు.
#WATCH | Several villages in Assam, flooded following torrential rain in the past few days pic.twitter.com/ln1Iy3ChXQ
— ANI (@ANI) June 22, 2023
18 జిల్లాల్లో ఇప్పటికీ కుండపోత వానలు
నివేదికల ప్రకారం అస్సాంలోని కనీసం 18 జిల్లాల్లో ఇప్పటికీ భారీ వర్షం కురుస్తోంది. కమ్రూప్ మెట్రో, కమ్రూప్, నల్బారి, బార్పేట ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. గౌహతిలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనిల్ నగర్, నబిన్ నాగే, జూ రోడ్, సిక్స్ మైల్, నూన్‌మతి, భూత్ నాథ్, మాలిగావ్ ప్రాంతాలు భారీ వర్షాలతో, వరదలతో అత్యంత ప్రభావితం అయ్యాయి. అస్సాం సహా మేఘాలయాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దిగువ అస్సాం జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలు అన్నీ మూసేయాలని డిప్యూటీ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ మంగళవారం నుంచి గురువారం వరకు అస్సాం, మేఘాలయకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్ర, శనివారాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial