CM Sharma Fires Kejriwal: ఇతర రాష్ట్రాలపై నిందలు ఆపి, వరదలకు పరిష్కారం చూడండి- కేజ్రీవాల్‌పై అస్సాం సీఎం మండిపాటు
CM Sharma Fires Kejriwal: ఢిల్లీలో వరదల పరిస్థితికి ఇతర రాష్ట్రాలపై ఆప్ ప్రభుత్వం నిందలు వేస్తోందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ విమర్శించారు.
CM Sharma Fires Kejriwal: ఢిల్లీలో వరదలకు ఆప్ సర్కారు ఇతర రాష్ట్రాలను నిందించడం మానేసి.. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎద్దేవా చేశారు. అస్సాంలో తరచూ వరదలు వస్తాయని తామెప్పుడూ ఎవరినీ నిందించలేదని చెప్పుకొచ్చారు. చైనా, భూటాన్ నుంచి వచ్చే నీటి ప్రవాహం వల్ల అస్సాంలో వరదల పరిస్థితులకు తాము వారిని నిందించకుండా.. శాస్త్రీయ ప్రతిస్పందనను ఏర్పాటు చేసినట్లు సూచించారు.
హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడం ద్వారా దేశ రాజధానిని వరద సంక్షోభంలోకి నెట్టేందుకు కేంద్ర సర్కారు, బీజేపీ నాయకత్వంలోని హర్యానా ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కు వెళ్లే హత్నికుండ్ బ్యారేజీ తూర్పు కాల్వలకు నీటిని విడుదల చేయకపోవడంపై హర్యానా ప్రభుత్వంపై ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. నీటికి భౌగోళికం తెలియదని అన్నారు. అస్సాంకు తరచూ వరదలు వస్తుంటాయని, అరుణాచల్ ప్రదేశ్, చైనా, భూటాన్ నుంచి వరద వస్తుందని అన్నారు. ఇది సహజమైన ప్రక్రియగా భావించి అస్సాం సర్కారు ఎవరినీ నిందించదని చెప్పుకొచ్చారు. వరదల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు శాస్త్రీయ ప్రతిస్పందనను సెట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Every year, we receive water from Bhutan, Arunachal, and even from China. We face floods with brave hearts. We experience pain and misery beyond human imagination, yet we do not blame others. Because we know that nature does not recognize geography.#delhiflood
— Himanta Biswa Sarma (@himantabiswa) July 16, 2023
కొన్ని రోజులుగా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తున్నారు. కొంతకాలంగా శర్మ నిప్పులు చెరుగుతున్నారు. కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్ కోసం వేచి చూస్తున్నానని, కానీ ఇవ్వడం లేదని కొన్ని రోజుల క్రితం అస్సాం సీఎం వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్.. ఢిల్లీలోని తన నివాసంలో శర్మను భోజనానికి ఆహ్వానించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే తనను పరువు నష్టం కేసుతో బెదిరించారంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు.
ఢిల్లీని వదలని వరద ముప్పు
ఢిల్లీని వరద ముప్పు వదిలిపోవడం లేదు. యమునా నది శాంతించినట్టే కనిపిస్తున్నా వరద నీళ్లు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు చాలడం లేదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని స్థితిగతులపై ఆరా తీశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి యమునా నది నీటిమట్టం భారీగా పెరిగింది. ఇక హత్నికుండ్ బ్యారేజ్ గేట్లు ఎత్తి వేయడం వల్ల ఈ వరద నీరు మరీ ఉద్ధృతంగా ప్రవహించింది. మొత్తం నగరాన్ని చుట్టుముట్టింది. సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇవాళ ఉదయం నాటికి (జులై 16) యమునా నది నీటి మట్టం 206.14 మీటర్లకు చేరుకుంది. ఈ వరద ముంచెత్తడం వల్ల రాజ్‌ఘాట్ మార్గం అంతా నీళ్లు నిలిచిపోయాయి. మయూర్ విహార్ కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడి ప్రజలందరినీ రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని అనుకునే లోపే మళ్లీ వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల ఆందోళన చెందుతున్నారు.