Bengal Dengue Cases: బెంగాల్‌లో డెంగ్యూ విజృంభణ, 38 వేల డెంగ్యూ కేసులు నమోదు
Bengal Dengue Cases: పశ్చిమ బెంగాల్ లో డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ సీజన్ లో ఏకంగా 38 వేల కేసులు నమోదయ్యాయి.
Bengal Dengue Cases: పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో డెంగ్యూ కలవరపెడుతోంది. ఈ సీజన్ లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ సీజన్ లో సెప్టెంబర్ 20వ తేదీ వరకు దాదాపు 38 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కోల్ కతా సహా దక్షిణ ప్రాంతంలోని జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఉత్తర 24 పరగణాలు జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఈ జిల్లాలో ఏకంగా 8,535 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా లో 4,427 కేసులు నమోదు అయ్యాయి. ముర్షిదాబాద్ లో 4,266 కేసులు, నదియాలో 4,233 కేసులు, హుగ్లీలో 3,083 కేసులు నమోదు అయినట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
ఉత్తర 24 పరగణాలు, ముర్షిదాబాద్, నదియా లో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ డెంగ్యూ ప్రభావిత ప్రాంంతాలు బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంటాయి. మరో సరిహద్దు జిల్లా దక్షిణ 24 పరిగణాల్లో 1,276 కేసులు నమోదు అయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ డేటా ప్రకారం, పశ్చిమ బెంగాల్ గత ఏడాది దేశంలో అత్యధిక డెంగ్యూ కేసులు 67,271 నమోదైన రాష్ట్రంగా నిలిచింది. డెంగ్యూ వల్ల కనీసం 30 మంది వరకు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సెప్టెంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు సుమారు 7 వేల డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. దక్షిణ బెంగాల్ లోని 15 జిల్లాల్లో 34,905 కేసులు వెలుగు చూశాయి. ఉత్తర బెంగాల్ లోని 8 జిల్లాలు, డార్జిలింగ్, కాలింపాంగ్ హిల్స్ తో సహా దాదాపు 3,276 కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
డెంగ్యూ రావొద్దంటే ఇలా చేయండి
డెంగ్యూకి నిర్ధిష్టమైన చికిత్స లేదు. అందుకే సకాలంలో గుర్తించడం వల్ల అత్యవసర పరిస్థితి రాకుండా జాగ్రత్త పడొచ్చు. పెద్దల కంటే పిల్లలు త్వరగా డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వారి విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఈ వర్షాకాలంలో మీ పిల్లలు డెంగ్యూ బారిన పడకుండా రక్షించుకునే కొన్ని మార్గాలు ఇవి.
దోమల నివారణ మందులు వాడాలి
చిన్నారుల చర్మం, దుస్తుల మీద దోమల వికర్షక మందులు పూత రాయాలి. ఇవి దోమల్ని దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. నిండైన దుస్తులు వేయాలి. సాయంత్రం ఆరు తర్వాత వారిని బయటకి తీసుకుని వెళ్లకపోవడమే మంచిది.
ఇంటి లోపల శుభ్రంగా ఉంచాలి
ఇండోర్ వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. పూల కుండీలు, ఇతర నీరు నిల్వ ఉండే ప్రదేశాలని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
రోగనిరోధక శక్తి
పిల్లలు సరిగా తినకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే వారికి మంచి పోషకాలు ఉండే ఆహారం అందించాలి. అది వారికి రోగాలని ఎదుర్కోవడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. వ్యాధుల నుంచి కాపాడుతుంది. అప్పుడే వాళ్ళు రోగాలతో పోరాడేందుకు బలమైన శక్తిని కలిగి ఉంటారు.
బహిరంగ కార్యకలాపాలు వద్దు
మెరుగైన రక్షణ కోసం బిడ్డ చేతుల వరకు ఉండే దుస్తులు వేయడం ముఖ్యం. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు ఇంటి లోపల ఉండే విధంగా చూసుకోవాలి. వర్షాకాలంలో ఆరుబయట ఆడుకునేందుకు అనుమతించవద్దు. దోమలు కుట్టకుండా చూసుకోవాలి.
లక్షణాలు అర్థం చేసుకోవాలి
తల్లి దండ్రులు డెంగ్యూ లక్షణాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మీ పిల్లలు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారో లేదో అర్థం చేసుకోవడం చాలా సులభం. పరిస్థితి మరింత దిగజారక ముందే నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఒక్కోసారి జ్వరం వంటి లక్షణాలు లేకుండానే డెంగ్యూ రావచ్చు. ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోకుండ చూసుకోవాలి. అది కనుక తగ్గిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.