Sikkim Floods: తీస్తా నదీ తీరంలో టపాసుల్లా పేలుతున్న ఆర్మీ మందు గుండు సామగ్రి
Sikkim Floods: సిక్కింలోని లొనాక్ సరస్సుపై మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో వరద బీభత్సం సృష్టించింది. వరదల్లో కొట్టుకుపోయిన భారత సైన్యానికి చెందిన మందుగుండు సామగ్రి తీస్తా నదిలో తీరంలో పేలుతోంది.
Sikkim Floods: సిక్కింలోని లొనాక్ సరస్సుపై మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో వరద బీభత్సం సృష్టించింది. వరదల్లో కొట్టుకుపోయిన భారత సైన్యానికి చెందిన మందుగుండు సామగ్రి ఇప్పుడు తీస్తా నది తీరంలో చాలా చోట్ల పేలుతోంది. తీస్తా నది ఒడ్డున బురదలో కూరుకుపోయిన భారత ఆర్మీకి చెందిన మందుగుండు సామగ్రి పాక్యాంగ్ జిల్లాలోని రంగ్‌పోలో పేలింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరి ఏమీ కాలేదు.
#Sikkim #Explosion
— Dr. Sandeep Seth (@sandipseth) October 6, 2023
Video showing a blast that occurred on the banks of river #Teesta. This video is purportedly from near #Rangpo.
A similar blast occurred just now near #Bardang.
Both Darjeeling Police and Sikkim Govt have issued this warning "The local population are… pic.twitter.com/tyP0n6OppT
సిక్కిం వరదల్లో మందు గుండు సామాగ్రి వరదల్లో కొట్టుకు పోయిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రజలు తీస్తా నది ఒడ్డుకు దూరంగా ఉండాలని కోరారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితికి సంబంధించి, సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SSDMA) ఇప్పటికే ఒక సలహాను జారీ చేసింది. ఈ ప్రదేశాలలో వరద నీటిలో కొట్టుకుపోయిన ఇండియన్ ఆర్మీ మందుగుండు సామాగ్రి ఉందని.. దానిని తారుమారు చేస్తే పేలుడు సంభవించే అవకాశం ఉందని SSDMA తెలిపింది.
ఈ మేరకు నదీ తీర ప్రాంత ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. తీరం వెంబడి ఏదైనా అనుమానిత వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇది కాకుండా, బర్దంగ్‌లోని నదిలో కూడా ఇలాంటి పేలుళ్లు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా చపడంగ గ్రామంలో జరిగిన మోర్టార్ బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఒక వ్యక్తి మోర్టార్ బాంబును తీసుకొని దానిని స్క్రాప్‌గా విక్రయించడానికి తెరవడానికి ప్రయత్నించినప్పుడు పేలుడు సంభవించింది. ఈ మోర్టార్ బాంబు భారత సైన్యానికి చెందినదని పశ్చిమ బెంగాల్ పోలీసులు భావిస్తున్నారు. తీస్తా నది వరదతో కొట్టుకుపోయి సిక్కిం నుంచి జల్పైగురి జిల్లాకు వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
వరదలకు వణికిపోయిన సిక్కిం
సిక్కిం ఉత్తర ప్రాంతంలో కురిసిన కుంభవృష్టి వర్షం ధాటికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఏడుగురు ఆర్మీ అధికారులతో పాటు మొత్తంం 30 మంది మరణించారు. వందల మంది గల్లంతయ్యారు. లోనాక్ సరస్సు ప్రాంతంలో భారీ వర్షాలు కరువడంతో తీస్తా నదిలో వరద పోటెత్తింది. దీనితో పాటు చుంగ్ థాంగ్ డ్యామ్ నుంచి కూడా నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తప్పిపోయిన 23 మంది సైనికులలో ఒకరిని రక్షించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. సైనికుల జాడ కోసం భారత ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్ దళాలు రెస్యూ ఆపరేషన్ చేపట్టాయి.
సిక్కిం ప్రభుత్వం ఈ వరదలను విపత్తుగా ప్రకటించింది. తెగిపోయిన 14 వంతెనలలో తొమ్మిది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పరిధిలో ఉన్నాయని, ఐదు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివని అధికారులు తెలిపారు. ఈ వంతెనలు తెగిపోవడం వల్ల రవాణా ఆగిపోయి దాదాపు మూడు వేల మంది పర్యాటకులు సిక్కింలోనే ఉండి పోయి భయం భయంగా గడుపుతున్నారని, తగిన సహాయక చర్యలు చేపడుతున్నామని ఓ అధికారి తెలిపారు. తీస్తా నది ఉగ్రరూపం ధాటికి సింగ్తమ్ వద్ద ఉక్కు వంతెన కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. పశ్చిమబెంగాల్, సిక్కింలను కలిపే 10వ నెంబరు జాతీయ రహదారి కొట్టుకుపోయింది. తీస్తా నది ప్రభావంతో ఉత్తర బెంగాల్‌లోనూ దాదాపు పది వేల మందికి పైగా ప్రజలను లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సహాయక శిబిరాలకు పంపించారు.
సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SDMAN) ప్రకారం, దాదాపు 25,100 మంది ప్రజలు కూడా విపత్తు బారిన పడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అధ్యక్షుడు ద్రౌపది ముర్ము ఇతర కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ మాట్లాడారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సీఎం తమంగ్ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారందరికీ తక్షణ సాయంగా రూ.2000 అందజేస్తామని ఆయన ప్రకటించారు.